పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 3.

ఇంద్రాణీ సప్తశతీ

243



1. ఇంద్రాణియొక్క ముఖమం దుదయించి, ప్రతిదిక్కున విశేష గుణముగల కాంతులతో ప్రసరించుచు, మిగుల నప్రియమగు తమస్సును ఖండించు హసితము నా కధిక మంగళముల నిచ్చుగాక.


2. లక్షసూర్యులకంటె నధిక కాంతులుగల ఇంద్రాణి శత్రువుల చాతుర్యమునకు మోహవశమయిన భారతభూమియొక్క (మోహ) తిమిరమును తత్క్షణమే పరిహరించుగాక.


3. లక్షచంద్రులిచ్చు శీతలసుధాకటాక్షము గలది, కోటిసూర్య ప్రభాకలితమైన పాదయుగళము గలది, మునులచే నుతింపబడునది, ఇంద్రుని చిత్తమును రంజింప జేయునది యదు స్త్రీ (శచి) నా హృదయమందు బ్రకాశించుగాక.


4. కమనీయ కాంతితో నొప్పు సుకుమార శరీరముగలది, మననము చేయదగిన పాదములుగలది, ఇంద్రునిప్రాణసఖి, సుముఖురాలు, అసత్యపరులకు విముఖురాలు అగునట్టి దేవి నాకు మంగళములు చేయుగాక.


5. ఓ దేవీ ! అనుమానించిన పితరునియొక్క మూఢవాక్యమువలన కుమారునిచే ఛేదింపబడిన శిరస్సుగల రేణుక నీ యొక్క కళచే ప్రకాశించిన దశలో గణనీయమగు శక్తి (రూపిణి) యయ్యెను. (ఇంద్రాణీ యవతారస్వరూపిణి యయ్యెను.)