పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 1.

ఇంద్రాణీ సప్తశతీ

225



బొందుదును. (వామనావతారస్మృతి - చిద్గుహలోని పరమాకాశ స్వరూపమంతటను నిండియున్న స్వరూపమున కవిభక్తమైనను ప్రతివ్యక్తియందు చిద్గుహనధిష్టించుట కంగుష్టప్రమాణ మగుట వామనవైభవము.)


6. ఏ రేణుకకుదయించిన (శక్తిగల) పరశువును (పరశువన గొడ్డలి గాక అస్త్రవిద్య గావలయును లేదా వేదభాషయందు కపాల భేదన మొనర్చు వైభవముగల సుషుమ్న కర్థమై యుండును) ధరించిన ముని యుద్ధమందు రాజుల తీవ్ర భుజగర్వమును హరించెనో, దయామయియైన ఆ రేణుక నాకు కుశలము జేయుగాక. (పరశురామావతారస్మృతి)


7. ఓ తల్లీ, శచీ ! శ్రీరాముని తమ్ముడగు లక్ష్మణుని బాణమందు బ్రవేశించి, సూర్యశతముకంటెను నధిక తేజస్సు గలిగిన నీ జ్యోతి సజ్జనులకు శత్రువైన రాక్షసుడగు ఇంద్రజిత్తును (మేఘనాధుని?) చంపెను. (రఘురామావతారస్మృతి)


8. ఓ తల్లీ ! బలమును బొందినది, శుంభనిశుంభులనెడి రక్కసుల మదమును హరించినది. గోపకుల ప్రభువైన నందునకు జన్మించినది, కృష్ణుని సోదరియై మాయాదేవిగా పుట్టినదియైన నీ తేజః కళవలన జగత్తు రక్షింపబడెను. (కృష్ణావతారస్మృతి)


9. కలికాల జనులే దేవిని గుఱించి యెన్ని విధములుగా జెప్పినను నిరూపించు కొనజాలకుండిరో, ముని హృదయ పద్మసౌధములపై (అసంగబుద్ధిరూపమున) విహరించుచు యతులైన సాధు జనులను రక్షించుచున్న ఆ దేవి ప్రకాశించుచున్నది. (ఇదియే శుద్ధబుద్ధి లక్షణము గనుక బుద్ధావతారస్మృతి)