పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 1.

ఇంద్రాణీ సప్తశతీ

223



1. మీనధ్వజుడైన మన్మధునకు జీవితమిచ్చిన జననియై, సురపతి యైన యింద్రున కర్ధాంగియైన యింద్రాణీదేవి తన స్వచ్చమైన హాసముచే నా బుద్ధి నావరించి, నా హృదయమం దలముకొనిన తమస్సును హరించుగాక. (ఇది మీనావతారస్మృతి)


2. నమస్కరించు దేవతాకిరీటముల తాకుడువలన కాయలుకాచి తాబేలు పృష్ఠముతో సమమగు పాదములుగలిగిన శచీదేవి యధికమై తొలగింప నసాధ్యమగుచున్న భారతభూమియొక్క పాపములను నశింపజేయుగాక. (కూర్మావతారస్మృతి.)


3. నమ్రులను బాలించుటయం దత్యంతాసక్తికలది, విభుని చిత్తమును హరించు విలాసముకలది. వరాహముఖ మొదలగు శక్తి మాతృకల స్వరూప జీవనాధారమగునట్టి యవ్యక్తమహిమ గలదియైన ఆదిమస్త్రీచే నేను గతిగలవాడనగుదునుగాక. (వరాహావతారస్మృతి.)


4. హిరణ్య సంబంధమగు మదమును హరించు ఘనమైన తేజస్సు గలది, పద్మముఖియు, రక్షించుటయందు దక్షురాలునగు ఇంద్రాణివలన నీ భూమియందు నా కుల మొక్కటియేగాక భువనమంతయు గతి బొందుచున్నది. (నారసింహావతారస్మృతి)


5. విభుడైన యింద్రుడు వామనమూర్తివేషమును ధరించగా నతని ననుసరించి వామనియై విరాజిల్లినది (మూర్తిసంక్షి ప్తమైనప్పుడు మూర్తియందు శక్తియు సంక్షి ప్తమగును). ప్రకాశించు దయ కలది, యెఱ్ఱని పాదములుకలదియైన యింద్రాణిని నేను శరణు