పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 4.

ఇంద్రాణీ సప్తశతీ

215



13. ఓ యంబా ! కృత్తశిరస్కురాలైనను జమదగ్ని భార్యయైన రేణుక తనయందు తత్క్షణమే ప్రవేశించిన నీ యొక్క గొప్ప తేజస్సుచే లోకశుభముకొఱకు తిరుగ జీవితమును బొందెను.


14. శిరస్సులేని శరీరములో స్పష్టముగా ప్రాణములు ప్రకాశించిన హృదయము బుద్ధితో గూడ బ్రకాశించినది. ఇంతకంటె విచిత్ర మేది యుండును ?


15. ఓ రేణుకా ! శిరస్సుతో నున్న నీయందు శచీ సంబంధమైన నొకానొక మోహన కళయు, శిరస్సులేని నీ యందామె యొక్క భీకర కళయు నుండెను.


16. ఓ యంబా ! పరశురాముడు కార్తవీర్యార్జున మహారాజును జయించినప్పు డా విజయమునకు నీ తపస్సే కారణత్వము బొందెను.


17. ఓ భగవతీ ! కృత్తశిరస్సుగల నీవు యుద్ధభూమియందు పరశురాముని భుజముల కమితబలమునిచ్చి, దుర్మార్గులైన రాజులను చంపించినదానవైతివి.


18. శుభమైన కుండలీపురము వాసవముగాగలది, పాదములకు నమస్కరించువారి పాపములను పరిహరించునది, కృత్తశిరస్కురాలు అయిన ఇంద్రాణీకళ నాకు కుశలమిచ్చుగాక.

(కుండలీపురమే పడైవీడను క్షేత్రము. ఇది వేలూరు సమీప మందున్నది.)