పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 2.

ఇంద్రాణీ సప్తశతీ

197



11. ఓ యంబా ! నీకంటె నధికురాలైన పద్మముఖి లేదు; నాక పతి కంటె నధికుడైన పురుషుడు లేడు; నందనవనముకంటె నధిక మగు వనము లేదు; శృంగారరసముకంటె నధికరసము లేదు.


12. సాటిలేని సౌందర్యముగల నీవు నాయికవు. దేవతా ప్రభువగు ఇంద్రుడు నాయకుడు. నందనవనము రసమునకు రంగస్థలము. ఇక్కడ మన్మధున కింక ఉత్సవము కా కేమి ?


13. ఓ దేవీ ! మీ యుభయులకు మృత్యుకథ దూరమైయున్నది. మీ యౌవన మెప్పటికి జారదు. కోరిన పరికరములు మీకు లభించకపోవు. ఇంక రసమునకు లోపమేమున్నది ?


14. ఓ తల్లీ ! యువరాజైన విష్ణువునకు సర్వవిష్టపభారము విడచి, నందనవనమందు మీరు సల్పు క్రీడలు నా యైశ్వర్యమున కగు గాక (గణపతి జన్మకవి).


15. ఓ దేవీ ! నందనవనమందు మీరు రహస్యాలోచనలు సల్పునప్పుడు నా యీ కృతి కొంచెము మిమ్ము స్పృశించినచో నాకంటె ధన్యుడీ జగత్తునం దెవడుండును.


16. ఓ దేవీ ! ఇప్పుడిక్కడ నమస్కరించుచున్న నాయొక్క మొఱ్ఱ నందనవనములో విహరించు మీ కేమైన విఘ్నము కలుగజేసినచో, నీ పాదపద్మములుబట్టి నేను క్షమాపణ వేడెదను.