పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 1.

ఇంద్రాణీ సప్తశతీ

181



10. శబ్దగతివలన కాలము పుట్టుచున్నది. అట్టి శ్రేష్ఠశబ్దము కాళి యనబడెను (గతిచే కాలమునుబుట్టించు శబ్దశక్తి). ధ్యానము చేయబడిన శబ్దమువలన సంసారమునుండి తరించుచున్నారు గనుక పండితులా శబ్దమును 'తారా' యనిరి.

(గతివలన పరిణామము లేదా పాచకత్వము ద్యోతనమగును. మఱియు క్రియాశక్తి తెలియబడుచున్నది. కనుక అవ్యక్తమగు శ్రేష్ఠశబ్దమేది క్రియాశక్తిచే నంతటను వ్యాపించి యాకాశవస్తువును వ్యాపింపజేయుటద్వారా యొక స్థితినుండి యింకొకస్థితికి దానిని పాకమొనర్చు చున్నదో, ఆ పాకక్రియాశక్తిచే వస్తురూపముయొక్క పూర్వస్థితి సంహరింపబడినట్లు. క్రొత్తది యుద్బవించినట్లుదోచును. అది నిజమునకు పరిణామమార్పు. దానికి కారణమగు శ్రేష్ఠశబ్దసంబంధ క్రియాశక్తిని కాళియనిరి. మన యుచ్ఛ్వాసనిశ్వాసలందీ శక్తి వైభవము తెలియబడును. ఇంక తారయనగా అవ్యక్తశబ్దశక్తియే యైనను, సర్వశబ్దముల కాంతర్యమందదియే యుండునను ననుభవము నిచ్చి వికృతులనుండి తరింపజేయును. ఉచ్ఛ్వాసనిశ్వాసలను గైకొనినచో, వాటి యొక్క శబ్దమూలము తార. ప్రణవస్వరూపము తార యగును. కేవల పరిణామక్రియాశక్తి కాళియగును. అనగా ప్రాణము. ప్రాణమందు వ్యాపారమును నిరూపించు శక్తి విభూతి అని రెండింటికి తాత్పర్యము. దశమహావిద్యలలో మొదటిది కాళి. రెండవది తార. మనయందు పరావాగ్రూపమున మూలాధారమందా వేశించిన కుండలినీ శక్తియే కాళి. పశ్యంతీ వాక్కనబడు నవ్యక్తప్రణశబ్దరూపిణి తార.)


11. వేదవిదులైన ఋషులు దేని నక్షరముగాను, వేదాంతులైన మునులు దేనిని ప్రణవముగాను, పురాణకర్తలు దేనిని గౌరిగాను పిలచిరో, తాంత్రికుల భాషలో నామెయే తార యగుచున్నది.

(శబ్దమువలెనే తేజస్సుకూడ ఫలభేదముచే రెండు విధములుగా పిలువబడుట తరువాత శ్లోకములో చూడుడు.)


12. ఏ యోజస్సువలన సంహారక్రియ జరగుచున్నదో (ప్రకాశించు చున్నదో) దానిని ప్రచండ చండిక యనిరి ; యే ఓజస్సువలన సకలానుభవసిద్ధి (ఆత్మానుభవ మన్ని యనుభవములకు మూల మను ప్రకాశము) కలుగుచున్నదో దానిని లలిత యని బుధులు పల్కిరి.