పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 4.

ఇంద్రాణీ సప్తశతీ

127



6. మేము ధ్యానించుట, పల్కుట, చూచుట, వినుట, జీవించుట - ఈ సర్వము నీవు నిద్రించుచున్నను నీ కాంతివల్లనే జరుగు చున్నవి.


7. ఓ తల్లీ ! నాడీబంధమువలన, అభిమానమువలన గూడ నీవు దేహమందు గప్పబడియుంటివి. (కనుకనే వీటిని గ్రంధులనిరి). ఒక దాని కపాయముగల్గినచో, రెండవది నశించును. అందు వల్ల తపస్సునకు రెండు మార్గములు సంభవించెను.

(ప్రాణము లేదా శబ్దసంబంధ మొకటి, మనస్సు లేదా రూపాభిమాన సంబంధ మొకటి.)


8. ఓ దేవీ ! ఎవని చిత్తము స్వస్థానమందుండునో, యెవని ప్రజ్ఞ బాహ్యగతముకాదో, వానిహృదయమందు తెలివివై నీవుంటివి.

(అనగా మనస్సును తన మూలమైన హృదయమందణచి, శిరస్సునకు బాహ్యగత మగుటకై రానీకుండుట. ఇది శ్రీరమణ మహర్షి యుపదేశములో నొకభాగము.)


9. ఓ తల్లీ ! ఎవని వాక్కు మనస్సుతో కలియకుండ తన స్వస్థానమందుండునో (ప్రాణము తన మూలమం దనగియుండుట - మూలాధారమున) వానియందు నీవు జాగరూకురాలవై లోకములో కీర్తిజ్ఞానములు గలవానిగా నీ వొనర్చు చుంటివి.


10. ఓ తల్లీ ! ఎవని కన్ను దృశ్యములను విడచి, తన యతి సూక్ష్మ అంతస్తేజో వృత్తియం దుండునో (నిర్విషయాలోచన), విశ్వము నుండి యలిప్తవై (విశ్వవ్యాపారమునుండి విడి) నీ వాతని యందు మేల్కొని, యచలవై ప్రకాశింతువు.