పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 2.

ఇంద్రాణీ సప్తశతీ

113



6. ఓ తల్లీ ! వనవిహారమందు నీవు మధుర వాగ్విలాసములచేతను, మిగుల గుణములుగల ముఖవిలాసము చేతను ఇంద్రుని మనస్సాకర్షించితివి.


7. బంగారుపద్మమువలె సొగసైన ముఖము. నల్లకలువ రేకులవంటి నేత్రములుగలది దేవి. తెల్లని కాంతులుగల ముఖము, తెల్లని తమ్మిరేకులవంటి కనులు గలిగినవాడు విభుడు.


8. తుమ్మెదలగుంపువంటి కొప్పు, మిక్కిలి మృదువైన భుజములు గల్గినది దేవి. వర్ష కాలమేఘమువంటి జుట్టు, మిక్కిలి దృఢమైన భుజదండములు గలవాడు విభుడు.


9. అమృతమునకు నిలయమైన బింబోష్ఠము, అద్దములను మించి ప్రకాశించు చెక్కిళ్లు గల్గినది దేవి. కాంతిగల తెల్లని దంతములు, వికసించిన పద్మములవంటి హస్తముగలవాడు విభుడు.


10. ఓ శచీ ! అత్యంత రమ్యమైన యువతివై నీవు సుందరశరీరము గలిగి యౌవనవంతుడై, త్రిభువనపతియైన నింద్రునితో గూడితివి.


11. ఓ దేవీ ! వికసించిన పుష్పములుగల మందార వృక్షవనపంక్తు లందు విహరించుచు నీవు మన్మధు ననుగ్రహించుచుంటివి.


12. ఓ శచీ ! నీ ముంగురులందు బ్రకాశించు కల్పకపుష్పము నూత్న మేఘ మధ్యమందు బ్రకాశించు నూత్న నక్షత్రము వలె భాసించుచున్నది.


13. ఓ దేవీ ! ఏ యమరవృక్షము వికసించిన పుష్ప సంపత్తితో నిన్ను భజించునో, అ తరువు ఔదార్యమును, ఐశ్వర్యమును గూడ (నీ వలన) బొందుచున్నది.