పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 1.

ఇంద్రాణీ సప్తశతీ

105



7. ఏ యాకాశశరీరిణి యీ ఆదిపురుషుని (సగుణదైవరూపమును) పుత్రభావముతో కల్పించి, తాను స్త్రీ తనువును బొంది యతనితో ప్రాణనాయకుని యందువలె రతి సల్పుచున్నదో,


8. జగన్మాతయు, సర్వపాపములను శమింపజేయునదియు, తంత్ర జాలముచే (శాస్త్రముచే) పొగడబడునదియు, సర్వమునకు బుద్ధిరూపిణియు, అమలయు, పరమమైనదియు నగు ఆమెను స్తుతించుచుంటిని.


9. విషయములను దెలియు బుద్ధియామెయే, విషయములందు వ్యాపించు కాంతియునామెయే, విషయములందు బ్రసిద్ధమైన ప్రీతి (యభిమానము) యామెయే. (విషయాభిమానముతో గూడిన వృత్తి చెప్పబడెను. అభిమానము వృత్తినుండి తొలగి మూలగతమైనప్పుడు విషయము లణగును). విషయముల నణచు స్థితికూడ నామెయే యగును.


10. ఎచ్చ టెచ్చట గ్రహింపదగిన వస్తువునందు నా బుద్ధి వ్యాపించు చుండునో, అచ్చటంతటను సకల చరితయైన నామె వ్యాపించి విలసిల్లుగాక.


11. ఓ దేవీ ! జగత్తునం దధిక బలముగల దుర్మార్గులచే పీడింపబడు దుర్బలులకు నీ పవిత్ర చరణమే శరణము.


12. ఓ తల్లీ ! పౌరుషము విఫలమైనప్పుడు నిన్ను సేవించుచుందురు. నీ కిష్టము లేనప్పుడు సేవించువాని పౌరుష మే మగునో చెప్పుము.