పుట:Himabindu by Adivi Bapiraju.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుద్ధారంభమైన మూడుగంటలకు సమదర్శి సేనలు చెక్కు చెదరక భోజనాది వస్తు సామాగ్రితో దుర్గములోనికి చొచ్చిపోయెను. వినీతమతి సమదర్శిని కౌగలించు కొనియెను. కోటలో విజయనాదములు భేరీభాంకారములు మిన్ను ముట్టినవి. మాళవ సైన్యములు మొగములు వ్రేలవైచినవి.

మిడుతలదండువలెనున్న మాళవ సైన్యములు మరునాడు ధైర్యవిహీనములై యుద్ధము చేయనారంభించినవి. ఇంతలో సుశర్మ చక్రవర్తిపంపిన కొన్ని సైన్యములు వచ్చిచేరినవి. వానితో శివభూతివచ్చినాడు. అతడు మాళవాధి పతిని గలిసికొని యిట్లనియె: “మహారాజా! ఆంధ్రరాజు సైన్యములలో కొన్ని విడిపోవును. ఆతని కుమారుడు యువరా జీపాటికి నిర్వాణపథమునకు జేరి, బుద్ధుని గొలుచుచుండును. ఆ వార్త ఆంధ్రులకు తెలియజేయుటకు మేమే అంచెల నుంచినాము. ప్రతిష్టానము తక్షణము మన స్వాధీనము కాగలదు. మంజుశ్రీ యువరాజు కాగలడు. కాన మనకు భయములేదు. ఆంధ్రసైన్యము లింక కొన్ని నెలలవర కిచ్చటకు రాజాలవు. ఈలోన నీమూకలనుక్కడంచి మనము జాగ్రత్తపడి యెదము గాక. సార్వభౌముని సైన్యములు తేరుకొని వచ్చునప్పటికి కళింగమున సైన్యము లన్నియు తిరుగుబాటొనర్చును. విదేహరాజ్యము మనకు సహాయము నంపును. మన మహాసైన్యము లన్నియు కలసి ఆంధ్ర రాజ్యముపై దండెత్తి ఆ దేశమును ముక్కలు చేయవలయున. మంజుశ్రీ మనచేతిలోని కీలుబొమ్మ. ఫలవంతమగు ఆ రాజ్యమంతయు మన పాలిటిదగును కాన మనకేమి భయము” అని వచించెను.

మాళవుని మొగము విప్పారెను. ఆంధ్రసైన్యములకిక బాసటరాదనియు, కోటలోని సైన్యముల హతమార్చవచ్చుననియు, ధైర్యముగా నుండు డనియు, దొంగలవలె ఆంధ్ర సైన్యములు రాత్రి శిబిరములు చొచ్చినవి కాని, లేకున్నచో పేరులేకుండ మాసిపోయి యుండుననియు సైన్యమంతట చాటిరి. జయజయనాదములు సల్పిరి. మాళవ సైన్యములు మహా సంతోషమున తేలియాడెను.

కాని శివభూతి తన పటకుటీరమున నస్థిరుడై గూర్చుండి ఇంకను ప్రతిష్టానము నుండి వార్తలేమియు రాలేదేమని మనోవేదన ననుభవించుచుండెను. “ఏమో! ఏమైనదో! ఏమికానున్నదో?” యని యాతడు పది సారు లనుకొనియెను.

22. ఆశ్రమము

కతిపయ దినంబులకు ధాన్యకటకమున కృష్ణాతీరమందు మహా చైతన్యమునకు కొలదిదూరములోనున్న స్థౌలతిష్యాశ్రమమునకు మహేశా నందాది పండితులు చేరినారు. ఆ ఆశ్రమ భవనములన్నియు రాతివి. ఆ ఆశ్రమము చాల భాగ్యవంతమైనది. అన్నియు తోటలే. తోటల నడుమ ఆశ్రమగృహాలు, సమస్త ఫలపుష్పాదులు గల యా తోటలో ఒక భవనమున్నది. వృద్ధుడును, మహాయోగియు నగు స్థౌలతిష్యుల వారందు వసింతురు.

స్థౌలతిష్యులవా రాంధ్ర బ్రాహ్మణుడు. ఆపస్తంబసూత్రుడని పెద్దలందరు. తక్షశిలయందు, వారణాసియందు, నైమిశారణ్యమునందు పెక్కు సంవత్సరము లధ్యయన మొనర్చి, యందందు గురుత్వము సలిపి స్వగ్రామమగు కృష్ణాతీరస్థ రాజశైలమున వార్ధకము గడుపుచుండెను.

అడివి బాపిరాజు రచనలు - 2

• 61 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)