పుట:Himabindu by Adivi Bapiraju.pdf/72

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఇట్టి మహానుభావుడగు యోగి తిరిగి విచ్చేసినాడని వినినంతనే మహా రాజాధిరాజు శ్రీముఖసాతవాహనుడు స్వయముగ నచ్చటికి విచ్చేసి ఆయనకు సకల సౌఖ్యముల సమకూర్చుట కనుమతినీయ బ్రార్థించెను. స్థాలతిష్యులు శాలివాహన సార్వభౌము నాశీర్వదించి, “మహారాజా! మీరు బౌద్ధ మతావలంబకులు. వేదములు పౌరుషేయము లనియు, యజ్ఞయాగాదిక్రతువులు హింసాత్మకములనియు, కర్మకాండ దూష్యమనియు వచింతురు. కలియుగ లక్షణములు మీ పాలనమున మూర్తిదాల్చుచున్నవి. మెలకువ నొందుట శ్రేయస్కరము. ఆంధ్ర వంశోద్ధారక! శాతవాహన వంశకులతిలకా! వృద్ధుడనగు నామాట వినుము. అనాదియగు వేదముల పుట్టుక నెవరు నిర్ణయింపగలరు? మీ శ్రమణకుడు వాక్రుచ్చిన భావనలు, నీతిబోధయు వేదములయందు లేవా? వేదనింద యొనర్చు నాస్తికధర్మమూని ఈ జాతిని భ్రష్టమొనర్పకుము. మహాచక్రవర్తులగు హరిశ్చంద్రాది నృపులవలె వేదధర్మ ప్రతిష్ఠచే యశము సముపార్జించుకొనుము. బౌద్ధదీక్షను వీడి పరబ్రహ్మదీక్షను గొనుము. భారతవర్షము నుద్ధరింపుము. సకలార్యలోకమట్టి చక్రవర్తికై ఎదురుచూచుచున్నది. మీచే రాజసూయంబు సల్పించెద. ఆగ్నిసమానుడు అర్థశాస్త్రవేత్త, కౌటిల్యుడు చంద్రగుప్తుని సామ్రాజ్యాభిషిక్తుని చేసినట్టు మిమ్ము నీ జంబూద్వీప సార్వభౌమ పదమున కభిషిక్తుని జేసెదను.” ఈ ముక్కలని వృద్ధుడగు తపస్వి తేజోవంతములగు తన తీక్షణ దృష్టుల శాతవాహనుని మోముపై బరపెను.

సాతవాహనుడు చిరునవ్వు నవ్వెను. స్థాలతిష్యులు పట్టుదలగలిగిన ఆర్ష మతాభిమాని అని మహారాజెరుగును. “ప్రేమతత్వమే అహింసావ్రతోదరణమే మూల సూత్రముగదా యీ మతమున? ఇందలి పాపమేమి మహాఋషీ? బౌద్ధమతమునందు అశోకచక్రవర్తి కాలమునుండియు సామ్రాట్టులు దీక్ష వహించిరి. సమస్త మతములవారిని సమదృష్టితో పరిపాలించుచున్నారు. నే డా పద్ధతి మార్చుటకు మాకు కారణమేమియు కనబడదు. కాన మమ్ము క్షమింపుడు. స్నేహభావముతో మెలగితిరి. మహాభాగా! ఈ విషయమున మీతో తర్కింపజాలను. మమ్మనుగ్రహింపుడు” అని చక్రవర్తి వేడుకొనెను.

సోనుత్తర చండికాది పండితులు వచ్చిన యీదినమందు స్థౌలతిష్యుని భవనమునం దొక్కమందిరమున నందరును సమకూడిరి. ఆ భవనమునందు విష్ణువు, శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు, ప్రజాపతి, మహేశ్వరి, గజలక్ష్మీ మొదలగు దేవతల విగ్రహములు కలవు. లింగమూర్తి పానవట్టమునం దొకచో ప్రత్యక్షమై యుండెను.

స్థౌల్యతిష్య మహర్ష్యాశ్రమమునందు శిలామందిరాలలో తాపసులు, పండితులు, వేదవేదాంగ పారంగతులు, సర్వశాస్త్రవేత్తలు కుటుంబములతో నివసించియుండిరి. విశాలభవనములలో, మండపములలో, వృక్షచ్ఛాయాపీఠములలో బ్రహ్మచారులు దీక్షతో సర్వశాస్త్రములు అభ్యసించుచుండిరి. వారితోపాటు ఆశ్రమమున వేరొకచోటనున్న బాలికావిద్యా మందిరములో అనేకులు బాలికలు సర్వవిద్యలు నేర్చుచుండిరి. ఖేదనము, అశ్వారోహణము, రథచోదనము, గజ విద్య మొదలైనవి నేర్పుచుందురు. ఆశ్రమ మధ్యభాగమున కృష్ణానదీతీరమందు యజ్ఞయాగాది క్రతువు లొనరింపబడుచుండును. స్థౌలతిష్యులు సర్వవిద్యా మహార్ణవ స్వరూపులు. వేదము లాయన ముఖమునందు ప్రజ్వరిల్లుచుండును. వేదభాష్యము లాయన ఫాలమున తేజరిల్లును. ఉపనిషత్తులన్నియు ఆయన చూపులలో తాండవించును. ప్రస్థానత్రయ మాతని హృదయము. అధర్వణవేద

అడివి బాపిరాజు రచనలు - 2
హిమబిందు (చారిత్రాత్మక నవల)
• 62 •