పుట:Himabindu by Adivi Bapiraju.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సర్వసైన్యాధ్యక్షా! ఆ ప్రకారము సేనల నడుపుము. మేమును సిద్ధముగ నుండగలము. చారుగుప్తుడు మనతో వచ్చునది. కోశాధిపతికి మహామాత్యుడాజ్ఞల నంపునది. వలయునంతయు సిద్ధముచేయు యుద్ధ సంఘములకు ముదలనీయవలసినది. చైత్యాచార్యులు జయముగోరి బుద్ధ భగవానునకు పూజల సలుపునది. ప్రజాలోకము దైవారాధన చేయవలసినది. మరియు....

చారు: దేవా! తమకు అడ్డము చెప్పుచున్నాను. మన్నింపుడు. ఈ జైత్రయాత్ర కగు వెచ్చమంతయు చారుగుప్తుడు భరించగలవాడు.

20. రహస్య సమావేశము

బౌద్ధమతము విజృంభించియున్న కాలముననే వేదమతము పునరుద్ధరింప బ్రాహ్మణులు, ఋషులు, పండితపరిషత్తులు, ఆశ్రమములు ప్రయత్నము చేయుచునే యుండిరి. పండితులగు బౌద్ధ సన్యాసులకు కర్మకాండ మాత్రులగు బ్రాహ్మణులు బదులాడలేకపోయిరి. తిమిరమువలె గప్పిన ఈ పాడుమతమును నాశము చేసి, త్రయీభక్తిదేశమున నెలకొల్పుటెట్టులని వారాలోచనలు సలుపుచుండిరి. అనేక సభలు, సమావేశములు వారణాసి నైమిశారణ్యాది పవిత్రక్షేత్రముల జరుగుచుండెను, కొందరు భగవంతుడు మహాశక్తివంతుడు, ఆతడే సర్వము చక్కబరుచును అని వాదించిరి. కొందరు పురుషప్రయత్న ముండవలె ననిరి.

అశోకచక్రవర్తి నిర్యాణమందిన వెంటనే మౌర్య ప్రతిభ నానాటికి తగ్గిపోయెను. బౌద్ధ మతమును సామ్రాజ్యమతముగా నొనర్చి, యాత్రికుల, నాచార్యుల, భిక్కుల నంపి చీనా, తుర్కీస్థానము, పారసీకము, బ్రహ్మదేశము, సింహళములందా మతము నెలకొల్పి మహోన్నత దశకు తీసుకు వచ్చిన సార్వభౌముడు గతించుటనే అచ్చటచ్చట నణగియున్న వేదమతము పూర్వాచార సంప్రదాయములు తిరిగి విజృంభించెను. మౌర్యసంతతి రాజగు బృహద్రధుడు మగధ సింహాసన మధిష్టించియున్నప్పుడు పుష్యమిత్రుడను ఆతని సేనానాయకుడు రాజును చంపి తాను రాజై బ్రాహ్మణమతము పునరుద్ధరణ చేయ సంకల్పించెను. అప్పటినుండి సామ్రాజ్య సింహాసనమెక్కిన రాజులు వేదాచార పరాయణులగు వారే. పుష్య మిత్రునిసంతతిలో శుంగవంశములో తుదివాడగు సుమిత్రుని మిత్రదేవుడు వధించి రాజయ్యను. మిత్రదేవుని సంతతివారిని పదచ్యుతులజేసి మంత్రులగు కాణ్వవంశమువారు చక్రవర్తులైరి.

కాణ్వవంశమువారందరు వేదమతము పునరుద్ధరింప దీక్షవహించినవారు. అనేక పండితులీ రాజుల ప్రోద్బలమునను, పై మూడు వంశముల ప్రోత్సాహమునను వైదికధర్మనిష్టులై అత్యంత పురాతనములగు రామాయణ భారతాది గ్రంథములందు ఋషిప్రోక్తములవలె బౌద్ధమత ఖండనములను బ్రక్షేపించిరి. పురాతనములగు మనుధర్మాదిస్మృతుల దమ ఇష్టమువచ్చినట్లు మార్పు లొనర్పసాగిరి. రాజతంత్ర మందుకూడ నీ యావేశపరులు పాల్గొని వేదమత ముద్ధరింప సమకట్టిరి. గోదావరి నదికి పశ్చిమోత్తరముగా పదునేడు గోరుతముల దూరమునున్న మహావనశాల యను పట్టణమునందు క్రీస్తుశకము పూర్వము 74 వ సంవత్సరమునకు సరియైన బౌద్ధశకము 483 పరాభవ సంవత్సరమున ఫాల్గుణశుద్ధ ఏకాదశీదినంబున ఒక భవనమునందు

అడివి బాపిరాజు రచనలు - 2

• 57 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)