పుట:Himabindu by Adivi Bapiraju.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదమూడవ మూహూర్తమున పౌరసభాశాలవారు భేరి కొట్టకమునుపు పది పన్నెండుగురు పురుషులు సభ జేరియుండిరి. వారందరు క్రిందపరచిన రత్నకంబళులపై కూర్చుండి యుండిరి.

ప్రథముడు: కనుక వేంగీపురమునందున్న సంచరణుడు ఇప్పుడేమియు పని చేయుటకు వీలులేదని మీరంటారు. అవునుగదా, మహేశ్వరానందా?

మహే: ఏమిచేయగలడు? మన సంచరణుడు తానై ఏమియు ప్రయత్నించలేడు. ఇక్కడ చుట్టుప్రక్కలకు ప్రాణము, శక్తి, సమస్తము నయిన యాతడు ఈ స్థానబలము తప్పినంతనే రెక్కలులేని పక్షివలె నయినాడు. ఎంత బలమున్ననేమి? ఎంత సంపదయున్న నేమి? అంగ బలముండవలె గదా. చంద్రస్వామి ఉన్నంతవరకు బౌద్ధుల ఆజ్ఞల, నుప దేశముల తూ.చా తప్పక నిర్వర్తించుచు మన ప్రయత్న మత్యంతాభివృద్ధి చేసినాడు. చంద్రస్వామి కారాగృహమునకు బోగానే సంచరణుని పని అయినది.

ప్రథముడు: అయితే చంద్రస్వామి విచారణ సంగతి యేమయినది? ఎట్టి దండము విధించిరి?

మహే: మాకింకను ఆ వార్త రాలేదు. ఇప్పటికిని చక్రవర్తి దినోత్సవములు జరుగుచున్నవి. ఎద్దుబండి పరీక్షలైనవి. ఆయన విచారణ ఆపుచేయునేమోనని కోటలో ప్రతీతి. ఒకవేళ విచారణమవసరములేకయే శిక్షింతురేమోయని కోటలోనున్న మన వేగులవాడు విశాఖుడు చెప్పినాడు. ఏది యెట్లగునో?

ప్రథముడు: రాజధాని యందున్న బ్రాహ్మణు లూరకుందురా? విచారణ లేకుండ శిక్షించుట ధర్మదూరమని చెప్ప సాహసించు మతాభిమానులు లేరా?

మహే: ధాన్యకటకముగూర్చి సోనుత్తరుడు చెప్పవలసినదే.

అందరును మహాపండితుడును, ప్రతిజ్ఞానిర్వహగర్వియు నగు సోనుత్తరస్వామి వైపుచూచిరి. సోనుత్తరుడు సామవేదము పాడినట్లీవిధమున వాక్రుచ్చెను. ధాన్యకటకము నందున్న బ్రాహ్మణులందరును రాజాభిమానులు. బ్రాహ్మణ నామధేయము కలిగిన పాషండులు, చార్వాకులు పైశాచస్వరూపులు. ఒక్కడైనా మహాపండితుడనైన నన్ను గౌరవము చేయరు. లేచి నమస్కారమునైన చేయరు సరిగదా నా మొగమైన చూడరు. నాకు కోపమువచ్చి “రండి. నాతో వాదమున” కని పిలిచితిని. ఆ శుంఠలు ప్రతి చెప్పరైరి. అయినప్పటికి చంద్రస్వామిని విచారణ చేయకుండ దండించుటకు చక్రవర్తికి గుండెలేదయ్యా ధర్మాతిక్రమణం చేయుటకు. అన్నిమతములయందును గౌరవము చూపుదునని ప్రతి సంవత్సరము మహాపరిషత్సభకు చెప్పుచుండునుగదా! ఆ మాట కిపుడు తప్పినచో నేనూర కొందునా? మీకు తెలియదా?”

ప్రథముడు: ఒకవేళ చంద్రస్వామిని విడుదల చేయకపోయినట్లయిన సంచరణునకు సహాయముగా మనలో దిట్టమైనవాని నొకని ఆ చుట్టు ప్రక్కల నెక్కడనో యుంచవలయును.

మహే: ఆ సంగతి మొదటినుండియు మహాభాగులు మనతో చెప్పనే చెప్పినారు. వారి

ఉద్దేశ్యము కూడా చెడుగు చేయవలెనని కాదు. మనము చేయుకార్యము ఉత్కృష్టమైనది. పుణ్యదాయకము, మోక్షదాయకము. ఆదిమీనము వేదముల నుద్ధరించుట వంటిది. వేదోద్ధరణచేయుట సర్వేశ్వరునకు మహాప్రీతికరము. దానిని, సాధించుటయే మన లక్ష్యము. తక్కిన పాపపుణ్యములతో మనకు బనిలేదు.

అడివి బాపిరాజు రచనలు - 2

• 58 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)