పుట:Himabindu by Adivi Bapiraju.pdf/49

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆ మరునాడు కోటలో ప్రాడ్వివాకసభా భవనమున చంద్రస్వామి విచారణము ప్రారంభించిరి. చంద్రస్వామికి అన్ని సౌఖ్యములు రాజపురోహితు లొసగిరి. ఉదయాస్తమయముల గాయత్రి జపించుకొనువాడు. తపస్సు చేసికొనువాడు. భగవన్నామ స్మరణానందప్రేంఖణమగు గానపరవశత్వ మందువాడు. చంద్రస్వామి భక్తుడు. భక్తులకు భయము, ప్రఫుల్లపద్మసూనంబులకు దుర్గంధము, పండువెన్నెలలకు వేడిమి యెచ్చట?

పూర్వకాలమునందు న్యాయవిచారణ నేటికన్న వేయిమడుంగులుత్తమముగ నుండెడిది. దేశమునకంతకు మహారాజసభ ప్రధాన న్యాయస్థానము. దాని వెనుక ప్రాడ్వివాకులసభ స్థానీయ, ద్రోణముఖ, ఖార్వతిక, సంగ్రహణ యనునవి పోనుపోను చిన్నవి. ఎనిమిది వందల గ్రామములకు ద్రోణముఖమును, రెండువందల గ్రామములకు ఖార్వతికము, సంగ్రహణము పది గ్రామములకు న్యాయస్థానములు. ఈ సభలు రెండు విధములు: ధర్మస్థీయము, కంటకశోధము అనునవి. ధర్మస్థీయము వ్యావహారిక ధర్మమునే విచారించును. కంటకశోథసభ వర్తకము, వృత్తి, రాజకీయము మొదలగు విషయముల ధర్మనిర్ణయ మొనర్చును. ప్రాడ్వివాకునిసభ ధర్మస్థీయ కంటక శోధ విషయముల రెంటిని విచారించును. ఆ పైన రాజే సభాపూర్ణుడై స్వయముగా న్యాయ విచారణ చేయును.

నేడు చంద్రస్వామిని కోటలోనున్న ప్రాడ్వివాకుని సభకు గొని వచ్చిరి. రాజభటు లిరువు రాతని తీసికొనివచ్చిరి. ప్రాతఃకాలోచిత కృత్యములు దీర్చికొని పిమ్మట ఉదయము రెండవ మూహూర్తఘటిక మ్రోగు నప్పటికి సభావ్యవహారము ప్రారంభింతురు. సభయందు ప్రాడ్వివాకు డొక ఉన్నతాసనముపై నధివసించియుండెను. ధర్మశాస్త్ర పండితులగు సభ్యులు మువ్వు రితరాసనములపై వేరొకయెడ వసించియుండిరి. ఒక వేదికపై నలువురు బౌద్ధభిక్షువు లొక మృదులమగు ఖర్జూరపుచాపపై నధివసించి యుండిరి. సంధ్యాపాలుడు, లేఖకుడు, గణకుడు (లెక్కలవ్రాయువాడు) వారి వారి యథాస్థానముల నుండిరి. ఏ న్యాయ సభయందును నొక్కపురుషుడు ధర్మనిర్ణయము చేయుట పూర్వకాలము నందెప్పుడును లేదు. వారుకాక నేర మెచ్చటనుండి వచ్చినదో అచ్చోటునుండి ధర్మ సహాయులు కొందరు వచ్చెడివారు. వారుగాక, ఏవిషయమున అనుమానము తటస్థించినను తమ అభిప్రాయములనిచ్చి సందేహము తీర్చుటకు ధర్మశాస్త్ర పారీణులగు భిక్షులు, బ్రాహ్మణులు కొందరు సభయం దుందురు. మహారాజే స్వయముగా విచారించినప్పుడై నను వీరందరు నుండవలసినవారే.

ఎవరి పైనైనను నేరము మోపబడినపుడు ప్రాడ్వివాకానుజ్ఞాతుడై సంధ్యాపాలుడు రాజముద్రాంకితమగు “ఆ సేద్యము” (పిలుపు) పంపును. ఆ పైన వారు వచ్చి తీరవలయును. బాలబాలికలు, ముదుసలులు మొదలగువారు మాత్రము రానక్కరలేదు. చంద్రస్వామిని రాజభటులు కొనిరా, పండితుడును యువకుడునగు నా ద్విజోత్తముని నొక చిత్రాసనమున కూర్చుండుమని ప్రాడ్వివాకుడు కోరెను. ఉత్తమకులసంజాతుడును, ధర్మశాస్త్ర పారీణుడును, సత్యవాదియు నగువాడే ప్రాడ్వివాకుడుగా నుండనరుడు.

14. నిర్దోషి

గణకుడు వచ్చి చంద్రస్వామి నవలోకించి “ఆర్యా! మహామంత్రి శ్వైత్రులవారు మీరు మహారాజుపై కుట్రలు సలుపుచున్నట్లుగా నేరము మోపినారు. దాని నిప్పుడు

అడివి బాపిరాజు రచనలు - 2
హిమబిందు (చారిత్రాత్మక నవల)
• 39 •