పుట:Himabindu by Adivi Bapiraju.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఋజువు చేయబోవుచున్నారు. తాము మీకోరిన ఋజుపత్రముల నావల కొనిరావచ్చును. నేరారోపణకానిచో అనగా మీపై నేరము ఋజువు కానిచో, తమ్ము క్షమింపుమని ప్రార్థింపుచు సభవారు మిమ్ము బంధవిముక్తుల గావించెదరు” అని వాక్రుచ్చెను.

తోడనే చంద్రస్వామి లేచి ప్రాడ్వివాకునిదిక్కు మొగంబై యిట్లనియె: “ఆర్యోత్తమా! ధర్మశాస్త్రములు నేరవిచారణ త్వరితముగ నొనరింపవలయు ననియు, లేనిచో సత్యము మరుగుపడిపోయి అన్యాయముగ నొకనికి శిక్ష కలుగుననియు ఉద్ఘోషించుచున్నవి. సత్పురుషుడును, మహాయోగియగు మీ తథాగతు డట్లు బోధించెను. పీఠకములట్లు సెలవిచ్చెను. ఆర్యధర్మము లట్లుపన్యసించినవి.”

“ఓ బ్రాహ్మణోత్తమా! ధర్మశాస్త్రములట్లు ఘోషించుట నిజమే. కాని కాలమానస్థితులు నీ బంధనకు కారణములైనవి. అనవసరముగ న్యాయ నిర్ణయము చేయుట కాలసించిన మహాపాపమని శాస్త్రములు పలికినవి. ధర్మము దోషజుష్టము గాకుండ నీ పెద్దలందరును జూడగలరు. మహారాజెట్టి ధర్మ తత్పరుడో నీవు యెరుంగుదువు. బౌద్ధధర్మములైన నేమి, వేద మత సంప్రదాయములేమి అధర్మము చేయవలదని శాసించుచున్నవి. ఇచ్చట మతధర్మ విచారణ చేయ వీలులేదు. పవిత్రములు, భగవత్పూజాపరములు, నిర్వాణ సముపార్జన కారణంబులగు సమంతభద్రోపదేశములేమి, పురాతనములు, దైవస్వరూపములగు వేద మంత్రములేమి అవ్వాని విచారణ ఈసభది గాదు. మహారాజన్ని మతములయెడ సమానాదరణ కలవాడు. కాని యీ సభ వ్యావహారికసంబంధమైనది. జ్ఞానివి, విద్యా పారంగతుడవగు నీకు మే మేమియు చెప్పనవసరములేదు. విచారణ ప్రారంభించు చున్నాను” అని ప్రాడ్వివాకుడు చెప్పెను.

అంత గణకుడు నల్లచేవకర్ర పీటపై నుంచిన కొన్ని తాళపత్రములు, ఒక భూర్జపత్రము, రెండు మొగలిరేకులు గొనివచ్చి ప్రాడ్వివాకునికడ పీఠిక పై నుంచెను. “ప్రమాణములందు లిఖితసాక్ష్యమును, తరువాతి ఘటాగ్న్యుదక విషకోశ దైవికములు ముఖ్యమైనవి, ఉత్తమమైనవి. ఈ పత్రములు, చంద్రస్వామి వ్రాసిన లేఖలు, అతనికి వచ్చిన లేఖలును అని చెప్పి సభాధ్యక్షుడగు నా ప్రాడ్వివాకునకు ఒక్కొక్క లేఖయు వినిపింప నక్కడనున్న సభ్యులలో నొక్కరిని గోరెను. ఆ లేఖాపత్రముల నెవరు సముపార్జించిరో, ఏరు తెచ్చిరో తెలియదు.

“ఓ పితామహసమాన! మేరునిశ్చల! బుద్ధసన్యాసి చేసిన పాషండ బోధలు ప్రజల ముక్తిదూరుల చేసినను, మన ప్రయత్నములచే వారు దైవ భక్తులగుచున్నారు. గ్రామములు బౌద్ధమతమునుగొని దేవపూజల మట్టు పరచినని. వేదగానములు లేవు. పురాణ శ్రవణములు లేవు. హరిభజనలు లేవు. మహేశ్వరార్చనలు కానరావు. మన దేవులందరును సర్వవిశ్వరూపుడైన భగవంతుడును ఈ పాషండుని సేవకులట. మన్మథుడు మారపిశాచియై యా “దివ్యమూర్తిని భ్రమ పెట్టబోయి యోడిపోయెనట. అట్టిది నేడు మరల వేదగానములు, భగవద్గ్రంథపారాయణము వినుచున్నాము. కొన్ని యజ్ఞముల జరిపించినాము. ఇంతకును మన చక్రవర్తి బౌద్ధుడు. ఆతనికి వేద మతసంప్రదాయము బోధింపకున్నచో నేమియు లాభములేదు. ఆతనికి పాషండమత బుద్ధి నశించి, దైవభక్తి కలుగునట్లు ప్రయత్నము చేయవలయును.”

ఇట్టి లేఖలు నాలుగయిదింటిని సభ్యుడొక్కడు చదివెను. ఇంకొక లేఖలో చివర “ఆంధ్రమున బౌద్ధరాజ్యము నశించి వేదరాజ్యము ప్రబలమగు గావుత” యని యుండెను. అనేక సాక్షులను విచారించిరి.

అడివి బాపిరాజు రచనలు - 2

• 40 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)