పుట:Himabindu by Adivi Bapiraju.pdf/46

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఈడువాడయినను బ్రహ్మచారియగుట నాతని గృహము నొక ముదుసలి మేనయత్త నిర్వహించుచుండును.

ఇంటికిబోయి దొడ్డిలోనికిజని కూపమున నీరుతోడికొని స్నానమాచరించి, సాయంకాల మూహించి, మడివస్త్రముల గట్టుకొని యాతడుసంధ్యార్చన చేయగడంగెను. సంధ్యార్చన పూర్తి చేసికొని యాతడు తన పూజాగృహము ప్రవేశించెను. మినుకు మినుకుమను అర్చనాదీపకాంతిలో మహావృషభమూర్తి, పదునాల్గంగుళముల తామ్ర విగ్రహమూర్తిగా ప్రత్యక్షమయ్యెను. ఆ విగ్రహమునకు చంద్రస్వామి సాగిలబడి ప్రార్థనా శ్లోకములు పఠించి లేచి, పద్మాసనము వేసికొని జపముచేయ ప్రారంభించెను.

మేనయత్త ఫలహారము కానిచ్చి, ఇల్లంతయు సర్దుకొని, తలుపు వేసికొని వచ్చి, దొడ్డిలో నులకమంచము వేసికొని పక్క వేసికొని నిద్దుర కూరినది.

గ్రామపు తలవరి మూడవ యామపు కేకలు వేయుచు పోవునంత వరకు చంద్రస్వామి జపదీక్షపరుడై యుండెను. జపము పూర్తి యగుట తోడనే లేచి మహేశమూర్తి ఎదుట సమాలింగిత భూతలుడై లేచి, దొడ్డిలోనికి జనెను. చుక్కలు మిన్కుమిన్కనుచుండెను. దూరమున పొలములలో నక్కకూతలు వినవచ్చుచుండెను. దొడ్డిలోనున్న వృక్షములు నిశ్చలములై దేవదేవుడగు నీశ్వరునిగూర్చి తపస్సు చేయుచున్నట్లుండెను.

“అయ్యో భరతఖండమంతయు నాస్తికుల పాలయినదే. ఎక్కడ బుద్ధుడు! ఎక్కడవేదములు. వేదములు పౌరుషేయములట. భగవంతుడే లేడట. బుద్ధుడే భగవంతుడట. అతడే తాను భగవంతుడనుకాను భగవంతుడే లేడని చెప్పినాడు. గాని ఈ భిక్కులు బుద్ధుడే సర్వసృష్టి స్థితి లయకారకుడైన ఈశ్వరుడు అంటున్నారు. బుద్ధునిమార్గమే అనుసరించెదరు. కొందరపరశైలవాదులట. కొందరుపూర్వశైలవాదులట. ఈ చార్వాకమతము మశూచిరోగమువలె భరతఖండమంతయు నల్లుకొనిపోయినది. భగవద్గీత, వేదాంతసూత్రములు ఎంత యుత్కృష్టగ్రంథములు! “దమ్మసూత్తము” లట; దద్దమ్మసూత్తములు కావా? జాతక గాధలట! త్రిపీఠకములట! వేదములు, ఉపనిషత్తులు, బ్రాహ్మణములు, ధర్మశాస్త్రములు, ఉపవేదములు, అన్నియు నాశనమైనట్లేనా? వినాశ కాలము వచ్చునది. ఏదియో మహా ప్రళయము ఆవహిల్ల బోవుచున్నది. చక్రవర్తులే బౌద్ధ దీక్షపరులైనప్పుడు ప్రజలగతి యేమి?

“శూద్రులందరు బౌద్ధ మతావలంబకులై బుద్ధచైత్యపూజాపరు లయ్యారు. ఏలాగు ఈ భయంకరస్థితిని మాపుట? గురుదేవులు అవతారమూర్తులు. వారే కల్కి అవతారదేవునకు వైతాళికు లగుదురుగాక!” అని ఆలోచించుకొనుచు ఇటునటు నడుచుచుండెను.

ఎవరో వీధి తలుపు తట్టినట్లయినది. “ఎవరువా” రని చంద్రస్వామి కేకవైచి ఇంటిలోనుండివచ్చి ముందరచావడి దాటి సింహద్వార కవాటము తెరచెను. కాగడాలతో కొందరు మనుష్యులు చంద్రస్వామికి కనిపించిరి. కాగడాల వెలుతురున నూత్న గ్రామణియగు శ్వితవుడు, గ్రామసంఘసభ్యులు, ఇరువురు తలారులు, కొందరు సైనికులు, నొక దళిపతియు నాయనకు గోచరించిరి.

చంద్రస్వామి “ఏమి ఇది?” యని ప్రశ్నించెను. శ్వితవుడు “అయ్యా నమస్కారములు. తాము చక్రవర్తిపై నేదియో దోష మెంచినారట. అందుకై తమ్ము బంధించి ధాన్యకటక నగరమునకు కొని తేవలయునని, మహా సైన్యాధికారి ముద్రవేసిన భూర్జపత్రముగొని యీ దళవాయి వచ్చినారు. కానీ మీ రీ క్షణముననే వీరివెంట పోవలయునని మే

అడివి బాపిరాజు రచనలు - 2
హిమబిందు (చారిత్రాత్మక నవల)
• 36 •