పుట:Himabindu by Adivi Bapiraju.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12. బంధితుడు

శోణనగ మను గ్రామము వేంగీవిషయమున గోదావరీనదీతీరమునకు మూడు గోరుతముల దూరమున నున్నది. శోణనగ మనుపేరు ఆ గ్రామము ప్రక్కనున్న ఎఱ్ఱటి కొండవలన వచ్చినది. ఆ గ్రామము ఫలమంతమగు భూములచే, తోటలచే నలరారుచు నూరు బ్రాహ్మణగడపతో, రెండువందల క్షత్రియులైన రెడ్ల గృహములచేతను, ముప్పది వణిజుల ఇండ్లతోను, రెండువందల ఏబది చాకలి, మంగలి, కుమ్మరి మొదలయిన శూద్రగేహములతోను నిండియున్నది. నూరు బ్రాహ్మణ గృహములలో ఇరువది ఇళ్ళు శిల్ప బ్రాహ్మణులవి. ఆ గ్రామములోని క్షత్రియులు, శూద్రులు, వణిజులు బౌద్ధ దీక్షావలంబకులు. బ్రాహ్మణులు వేదధర్మ మనుసరింతురు. శిల్ప బ్రాహ్మణులు ఈ వైదిక సాంప్రదాయమన్నను, బౌద్ధసంప్రదాయమన్నను సమాన గౌరవము, భక్తియు గలవారు.

శోణనగ గ్రామవాసులు చైత్రశుద్ధపాడ్యమినాడు గ్రామ శృంగాటక ప్రదేశమున అశ్వత్థ నింబ వృక్షసంశ్లేష స్థల విశాలవేదికపై కూడినారు. గ్రామణియు, పూర్వసంవత్సర సంఘసభ్యులు వేదికపై తాటియాకుల చాపల పై నధివసించిరి. తక్కుంగల ప్రజలందరు వేదికచుట్టును నచ్చటచ్చట గుంపులుగా విడిగా కూర్చుండియుండిరి. గ్రామ పురోహితుడగు చంద్రస్వామి పంచాంగ శ్రవణము నొనర్చెను.

ఆపైనా సంవత్సర గ్రామపాలకులగు గ్రామణిని. పంచసంఘ సభ్యులను ఎన్నుకొనిరి. ఎన్నుకొనుట యనగా గ్రామవాసులు వారు వారు సభ్యులువారు గ్రామణులు అని పేర్కొందురు. తక్కినవారు వల్లెయని కేకలనిడుచుగాని, చేతులనెత్తిగాని తెల్పుదురు.

ఎన్నుకొనిన సభ్యులును, గ్రామణియు “దమ్మసూత్త” గ్రంథము చేత నుంచుకొని ఆ సంవత్సరము తాము శోణనగ గ్రామమును ధర్మయుతముగా, ప్రజాహితముగా పరిపాలింతుమనియు, తామాగ్రామప్రజలకు, భగవంతునికి సంపూర్ణ సేవకులమనియు వాగ్దానములు చేసిరి.

ఆ కాండ నెరవేరుటతోడనే గ్రామపురోహితుడును, తక్కుంగల బ్రాహ్మణులును వేదపనసల చదివి, వారందరి నాశీర్వదించిరి. పుణ్యాంగనలు పాటలుపాడి హారతులిచ్చి తిలకములిడిరి. వారిపై అందరు అక్షతల జల్లిరి. అచ్చటనుండి గ్రామోత్సవము లారంభమైనవి. ఆటలతో, పాటలతో, భజనలతో గ్రామమంతయు ఉప్పొంగిపోయినది. ఆంధ్రదేశమునం దాదినము ప్రతిగ్రామమునం దట్టి ఉత్సవములు, ఎన్నికలు జరుగును. రాత్రియంతయు భగవత్కథాకాలక్షేపము జరిగినది. ఆ వెనుక యక్షనాటకము ప్రదర్శింపబడినది.

కాని పురోహితుడగు చంద్రస్వామి ఉత్సవములం దేమియు పాల్గొనక, తలవాల్చికొని యింటికి వెడలిపోయెను. చంద్రస్వామి ఆపస్తంభ సూత్రుడు, కృష్ణయజుర్వేది, భారద్వాజుడు ఆతడు సాంగవేది, ధర్మశాస్త్ర కోవిదుడు, ఐతిహాసికుడు, గృహ్యసూత్రాల ఉద్దండవిజ్ఞాని. చుట్టుప్రక్కల గ్రామముల పురోహితులలో, బ్రాహ్మణులలో తలమానికము వంటివాడు. మధ్యమ వర్చస్వి బక్కపలుచని దేహపుష్టి కలవాడు. విశాలవదనము కలవాడు. ధనువునకు రెండుగుప్పిళ్ళు తక్కువ ఎత్తుతో, సమనాసికతో, చిన్న కళ్ళతో, పొడుగాటి మెడతో భుజములకంటు చెవులతో నాత డపర బృహస్పతి వలె తేజరిల్లుచుండును. ముప్పదిఏండ్ల

అడివి బాపిరాజు రచనలు - 2

• 35 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)