పుట:Himabindu by Adivi Bapiraju.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అమృతపాదులు వేదాంతము బోధించినారు. తాను శ్రీకృష్ణునికి వేదాంతము బోధించి మనస్సు త్రిప్పెద ననినారు. మహారాణి ఇట్టి సంఘటన కెంతయో వాపోయినది. తనకుమారుని ప్రాధేయపడి యొప్పించెద నన్నది. ఇట్టివారే తనకు సహాయము చేయలేనిచో ఇక నెవ్వరీ ప్రపంచమున సాయపడగలరు?

తా నధర్మాభిరతుడు కాడు. రాజమార్గమగు సత్యమునే తా ననుష్ఠించును. ఎందుకు తన కీఅవమానము, బాధ, ఆశాభంగము కలుగవలెను? తన తనయ కిట్టి గతి పట్టవలెను? తన పూర్వకర్మమా? తన తనయ పూర్వకర్మమా? కర్మ నతిక్రమించు నధికారము తనకు, తన తనయకులేదా? తనయయూ తన కోర్కె నిరాకరింపనని వాగ్దాన మిచ్చినది.

విషకన్యల విషయము కథలలో వింటిమి. ఇప్పు డట్టిసంఘటన నీ స్థౌలతిష్యుడు ప్రత్యక్ష మొనరించెను. ఆ విషకన్య తా నే విధి నిర్వర్తింప ప్రయుక్తయైనదో అది చేయవలెను. లేదా, తానే నశించిపోవలయును. ఈ బాలిక స్థౌలతిష్యుని మనుమరాలట. ఈమె ఆ రెండుపనులను చేయలేదు. ఇది ఏమి చిత్రము!

స్థౌలతిష్యుడు రాజవంశమును జయింతునని బయలుదేరెను. ఏమియు చేయలేక పోయినాడు. తనకు మాత్రము తీరని అపకారముచేసినాడు. తనబాల నెత్తుకొని పోయి, సువర్ణశ్రీని ఆమెను జతకూర్చినాడు. విషకన్యను ప్రయోగించి శ్రీకృష్ణయువరాజు మనస్సు విరిచినాడు.

బుద్ధభగవానుని దయ ఇట్టిదా? వేదములలో, ఉపనిషత్తులలో, పురాణములలో తెలుపబడిన దేవతలను, పరమేశ్వరుని నిరసించి ఈ ధర్మమును నమ్మినవారి పని ఇట్ల యగును కాబోలు! నేను కాశికావిశ్వేశ్వరునే నమ్మవలయునా?

ఆతని ఆవేదన తీర్చువా రెవ్వరు? అప్రయత్నముగ నాతనికన్నుల నీరు స్రవించినది. ఆతడు వెంటనే తన రత్నస్థగితమంజూష తెరచి స్వర్ణ విగ్రహరూపయైయున్న ప్రజాపతిమిత్రను కనుంగొని, కన్నులకా ప్రతిమ నద్దుకొని వెక్కి వెక్కి రోదించినాడు. ఆతనిగుండె అదిరిపోయినవి. ఆతని కంటినీరావిగ్రహము నభిషేక మొనరించినది.

“ప్రాణేశ్వరీ! నీ ముద్దులబిడ్డను చక్రవర్తిని చేయ సంకల్పించితిని. అందుకై అనంతమగు నా సంపదనంతయు గడ్డిపోచగ నెంచి వెచ్చింపనెంచితిని. నాచేతనైన ప్రయత్నము చేసితిని. ఆత్మేశ్వరీ! మహారాణులకన్న ఉత్తమురాలా! నీ వేల నన్ను వదలిపోతివి? హితకరమైన నీ ఆలోచన నాకు దూరమై పోయినది. నీ బిడ్డ దిక్కులేని దైనది. బ్రతికి యీ తండ్రి అప్రయోజకుడు, అసమర్థుడునై జీవచ్ఛవమైనాడు.”

చారుగుపుడు చైతన్యరహితుడైనాడు. ఇంతలో అతనికి తెలివి వచ్చినది.

ఎదుట సశరీరయై ప్రజాపతిమిత్ర నిలిచియున్నది. ఆమెకన్నులలో దివ్యకరుణ వెన్నెల వెలుగులను జల్లుచున్నది. చారుగుప్తుడు అదిరి పడి “నీవు వచ్చితివా! ప్రాణేశ్వరీ! ఈ దీనునికి ప్రత్యక్షమైనావా?” అని గోల పెట్టెను.

ప్రజాపతిమిత్ర ఇట్లు పలికినట్లాతనికి వినంబడినది: “ప్రభూ! ఏల నంత బాధపడెదరు? మనబాలిక ప్రేమను పాలింపుడు. ఆమెయే మీకు సర్వానందములు సమకూర్చును. మీరు చేసిన ఏ కార్యమును ఫలరహితమై పోదు. హిమ సువర్ణుల దివ్యప్రేమలో మీరు లోకాతీత రహస్యముల గ్రహింతురు. నేను సదా మీ ప్రక్కనుంటిని. అటుల నింకను ఉందును. మీరు అమితాభసామీప్య పదవి నందువరకు నుందును. ఆ వెనుక మన మిరువురము ఒకటియైపోదుము.”

అడివి బాపిరాజు రచనలు - 2

• 272 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)