పుట:Himabindu by Adivi Bapiraju.pdf/283

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ విచిత్రదర్శనము కరగి చేతిలోని జాంబూనద సాలభంజికలో చేరిపోయి నట్లయినది. ఆత డా విగ్రహమును హృదయమున కద్దుకొని, ముద్దిడుకొని, తనఫాలమున చేర్చి, సంధ్యారుణకాంతులు తన్నలమి, కరిగిపోయి, చిరుచీకట్లలమి, వెన్నెలకాంతులు తనపై ప్రసరించువరకు అట్లే నిలుచుండిపోయెను.

సువర్ణశ్రీ మహావీరుడు, ప్రజ్ఞానిధి, మహోత్తముడు. అతని తాను లోకోత్తరుని చేయును. ఆతడే హిమబిందునకు ప్రాణేశ్వరుడగును. చారుగుప్తుని తనయ సాధారణ మానవుని ప్రేమింపదు. ఆతనిలో ఏ మహోత్తమపవిత్ర శక్తులున్నవో అవి ఆశాశోత్తాలమై విశ్వమున ప్రజ్వరిల్లు గాక! తన ఆత్మేశ్వరి ఆదేశము దివ్యధర్మసూత్ర మగుగాక!

చక్రవర్తి యింతలో చారుగుప్తుని మందిరములోనికి వచ్చినాడు. చారుగుప్తుని హస్తములనున్న విగ్రహ మా చీకటిలో మెరసిపోవు చున్నది.

చారుగుప్తుడు చక్రవర్తిని చూచి చకితుడై “మహాప్రభూ! తామే వచ్చినా రేమి! వార్త నంపిన తమ్ము సేవింప నేనే వచ్చియుందును” అనెను.

“చారుగుప్తులవారూ! మీరు మా సోదరులు. మేము ఈ పాటలీపుత్రమున సింహాసన మధిష్ఠించునాడు, మీరును మా ప్రతినిధిగ మహా రాజు సింహాసన మధివసింప మిమ్ము కోరుటకు వచ్చితిమి.”

“మహాప్రభూ! నాకు సింహాసనాసీనత వలదు. నేను భగవద్ధర్మము పాలించుటయే ఈ దేవికి ఇష్టము అని నా నిశ్చయము. తమయాజ్ఞ కెన్నడు నెదురాడి ఎరుగని నేను నేడు మొదటిసారి ఈ మనవి చేసికొన సాహసించుచున్నాను.”

“సువర్ణశ్రీకుమారులను మేము కళింగాధిపతిగ జేయుచున్నాము. మీరును మా సంకల్పించిన సత్కారము స్వీకరింతురని అనుకొంటిని.”

“నా బిడ్డను సువర్ణశ్రీకి అర్పింప నిశ్చయించుకొన్నాను దేవా! మీ యాశీర్వాదమే నాకు సత్కారము.”

“హిమసువర్ణుల ప్రేమోదంతము కీర్తిగుప్తులవారు మాతో చెప్పి యున్నారు. పాటలీపుత్ర మహారాజ్యము మీది. మీరది ఏమిచేసినను మీ యదియ! మీబాలకరణమిండు, లేదా సువర్ణునకు....”

“ప్రభూ! ఎంత చక్కని ఉదారత మీది! సువర్ణునకే ఈ రాజ్యమిండు.”

“తథాస్తు.” చక్రవర్తి వెడలిపోయెను.

ఆ జాంబూనదవిగ్రహమును నవరత్నఖచితపూజాపీఠికపైన నుంచి చారుగుప్తు డా సింహాసనము ఎదుట పద్మాసనస్థుడైనాడు. 

15. వారణాసీయాత్ర

చారుగుప్తుడు స్వస్థచిత్తుడై కుసుమపురహర్మ్యమున హిమబిందు కుమారివసించు శుద్ధాంతములకు పోవలెనని అనుకొను సమయమున పరిచారికలు భయము గదురు మనసులతో వణకుచు అవనతవదనలై చారుగుప్తునికడకు విచ్చేసిరి.

చారు: ఏమి పని?

ఒకపరిచారిక: ప్ర.... ప్ర.... భూ!

అడివి బాపిరాజు రచనలు - 2

• 273 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)