పుట:Himabindu by Adivi Bapiraju.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వర్షాకాలము వచ్చుటచే వానలు కుంభవృష్టిగ గురియుచున్నవి. గంగానది వరదలై తెల్లటి బురదనీళ్ళతో ప్రవహింపుచుండెను. ఈదురు గాలి విపరీతముగ వీచుచున్నది. శోణానదియు పొంగివచ్చినది. ఆకాశము సర్వకాలము మబ్బులతో నిండియేయున్నది. వర్షములు యుద్ధనిర్వహణ మున కంతరాయమును గల్పించుచున్నవి. గ్రహణి మొదలగు రోగములు ఆంధ్ర సైన్యముల బ్రాకుచున్నవి. వైద్యులకు పని ఎక్కువ అయినది.

సువర్ణశ్రీ మహాసైన్యాధ్యక్షులతో మాటలాడినపిమ్మట నాల్గవనాటి రాత్రి కన్ను మిన్ను కప్పి జోరున వర్షము కురియుచున్నది. ఆ వర్షములో రెండువందల నావలు సైనికులతో, తోళ్ళుకప్పిన సామానులతో కిటకిట లాడుచు, పాటలీపుత్ర గంగాతీరమున నొక గోపురద్వారముచెంత నాగినవి.

ఆ వర్షపుమ్రోతలో పడవలలోనివా రొకరు శంఖ మొకటి “భోం, భోం, భోం, భోం, భోం, భోం,” అని పలికినది. అంత లోననుండి నింకొక శంఖము ప్రతిధ్వనిగా “భోం, భోం,” అని పలికినది. అంత పడవలలోనుండి కాహళియొకటి, “టు, టు, టూహూ” అని అరచినది. ఇంతలో నెమ్మదిగ గోపుర మహాద్వార కవాటముల నున్న చిన్న కవాట మొకటి తెరువబడినది. ఒక్కొక్క పడవ గోపురసోపానముల కడకు వచ్చుట, అందుండి సామానులతో, సైనికులు దిగి ఒక్కొక్కరు, ఇరువురు, ముగ్గురు లోనికి పోవుచున్నారు. అటుల రెండువేలమంది వెళ్ళిరి, మూడువేలమంది వెళ్ళిరి, సోపానములకడ వేలకొలది పడవలు మూగిపోయినవి. జనము దిగుచునేయున్నారు. లోనికి పోవుచునే యున్నారు.

ఆవల భూభాగమువైపు ఆంధ్రులు వర్షమని వెరవక ఏనుగులచే, శకటములచే, అస్త్రములచే, శస్త్రములచే నగరకుడ్యముల పొడవుననున్న ఇరువది, ముప్పది గోపురములకడ తలపడిరి. ప్రతి బురుజుపైన శతఘ్న్యాది అస్త్రములు వచ్చి, బురుజు గోడలను బద్దలుకొట్టుచుండెను. మాళవులు, మాగధులు, శూరసేనులు కోటగోడలపై విజృంభించి బాణములు, శతఘ్నులు, రాళ్ళు, యంత్రములు ఎడతెగక ప్రయోగించి ఆంధ్రుల నాశనము చేయుచుండిరి.

అయినను ఆంధ్రుల వేగము, ధాటియు తగ్గలేదు. గోపుర మహాకవాట మొకటి ఆంధ్రుల ధాటికి ఫెళఫెళ విరిగిపోవునట్లుండెను. ఆ గోపురముకడ చక్రవర్తి శ్రీముఖుడు స్వయముగ తన మహాదంతావళముపై నధిరోహించి యుద్ధము నడుపుచుండెను. వేరొక గోపురముకడ స్వైత్రులవారు నాయకత్వము వహించిరి. శ్రీకృష్ణసాతవాహనులు మరియొక గోపురముకడ విజృంభించి యుద్ధమును సాగించుచుండిరి.

ఒక్కసారిగ పొంగివచ్చు గంగానది ముంపులవలె, శోణానది పొంగులవలె ఆంధ్ర సైన్యములన్నియు, ఆ రాత్రి ఆ అఖండసృష్టిలో పిడుగులై, మెరుపులై, మరుత్తులై, పుష్కలావర్తక మహామేఘములై పాటలీ పుత్రనగర కుడ్యములపై గవిసినవి.

ఆ వృష్టిలో క్రింద శత్రువు లేమౌచున్నదీ మాగధులకు, మాళవులకు తెలియుట లేదు. ఆంధ్రులకు గోడలమీదనున్న శత్రువులసంఖ్యయు తెలియుటలేదు. అశ్వఘోషలు, గజఘీంకారములు, వీరుల సింహనాదాలు మహాప్రళయనాదములై పోయినవి.

గోడలమీదివారకి “శత్రువులు చొరబడినారు” అన్న మహాధ్వని యొకటి వినబడసాగెను.

అడివి బాపిరాజు రచనలు - 2

• 237 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)