పుట:Himabindu by Adivi Bapiraju.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గంగఒడ్డుననున్న ఆ సింహద్వారములోనికి అనంతమై మాళవులు ప్రవేశించు చుండుట అచ్చటి సేనాపతికిని, సైనికులకు నానందమైనది. కాని సంతత ధారగా వేయి, రెండువేలు, మూడువేలు, నాల్గువేలు మాళవులు వచ్చుట కా సేనాపతి యక్కజంపడి మాళవసేనాపతిని మీ రెంతమంది సైనికులతో వచ్చినారని యడిగెను. రెండువేల అయిదు వందలమంది వీరు లుందురని యాతడు చెప్పెను.

“మీరు లెక్కపెట్టలేదేమో. ఇప్పటి కయిదారువేలమంది వచ్చినారు. ఇంకను పది పది హేను వేలమంది పైన నున్నారు. మహావర్షము కురియుచున్నది. విరోధులు రారుగదా యని గోపురద్వారములను మీ ఉప సేనానులు కొందరు పూర్తిగ తెరచివేసినారట. ఈపాటికి ఎనిమిదివేలమంది లోనికి వచ్చియుందురు.”

“ఏమిటిది! ఇది యేదో మాయగ నున్నది. చూచెదము రండు.”

ఇంతలో కోటబురుజు మూలముననున్న వీరిమందిరములోనికి ఇరువురు సేనాపతులు, కొంతమంది సైనికులు బిలబిల నడిచివచ్చినారు. “ఇదియేమియని” ఈనాయకు లనుచుండగనే “అయ్యా, నేను సువర్ణశ్రీ సేనాపతిని, మిమ్ముల నిరువుర మా సైనికులు బంధింతురు” అని అనుచుండగనే ఆ మాళవ సైనిక వేషధారులు వారిని బంధించినారు.

నాలుగువేల మాళవ సైనికులు నచ్చటికి పావుక్రోశము దూరములో నున్న వేరొక నదీతీరము గోపురముకడకు వేవే బోయి, ఆ గోపురకవాటములు తెరచిరి.

సమవర్తి ఉగ్రుడై తనతోవచ్చు ఒక బాలవీర నాయకుని సహాయమున నెదిరించుచు సైనికుల ఆయుధముల లాగించుచు, మహావేగమున నగరములోనికి మూడువేల సైనికులతో పోసాగెను. సోమదత్తుడు మూడు వందల గజముల నదిలో ఈదించుకొనుచు గోపురద్వారమున నగరములోనికి చేరి, నదీతీరమందున్న బురుజుల పట్టించుచుండెను. శుకబాణుడు వేయి ఆశ్వికులతో మహావేగమున చక్రవర్తి యుద్ధముచేయు బురుజు కడకుపోవు చుండెను. గోండులతో మహాబలుడు గంగప్రక్కనున్న భూఖండముపైని గోపురము పట్టుకొనెను.

ఈ గడబిడ యగునప్పటికి నగరములో గగ్గోలు బయలుదేరెను. ఆ కటిక చీకటిలో, వర్షములో ఏమిజరుగుచున్నదియు నెవరికి తెలియక, ఆ దినమున వంతు లేక యుద్ధవిశ్రాంతిగైకొను నాయకులు కవచములు తాల్చియు, తాల్చకయు, ఆయుధములు సేకరించియు సేకరించకయు, తమ తమ భవనములవీడి తమ సైన్యాగారములవైపు పోదొడగిరి. వీధుల నిండి పోయి ఆంధ్రులకు పట్టుబడిరి.

చక్రవర్తి పోరాడు గోపురద్వారము ఇంతలో ముక్కలయ్యెను. ఆంధ్రులటనుండి లోనికి రాసాగిరి. శుకబాణుల ఆశ్వికులు అచ్చటనున్న మాళవులను చెండాడుచు నిరాయుధుల చేయుచుండిరి.

పాటలీపుత్రనగరము ఆంధ్రుల వశమైనది.

***

అడివి బాపిరాజు రచనలు - 2

• 238 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)