పుట:Himabindu by Adivi Bapiraju.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధర్మనంది భార్యనుచూచి, “ప్రయాణము సౌకర్యముగ జరిగినదా?” యని ప్రశ్నించెను.

శక్తి: అమృతలతాదేవియు, కీర్తిగుప్తులవారు, వినయ గుప్తులవారు మాతో వచ్చియుండిరికదా! అందులో కీర్తిగుప్తులవారి ఆదరణము వర్ణనాతీతము. ఆయన సువర్ణుని చూడవలెనని ఎంతయో కుతూహలము కనబరచినారు. ఆయనకు దారిపొడుగున వచ్చు వార్తలన్నియు మొట్టమొదట మా బసకు వచ్చి చెప్పుచుండువారు.

ధర్మ: కీర్తిగుప్తులు ఉత్తమపురుషులు. ఆయన హృదయము ప్రేమమయము.

నాగ: కాని అమృతలతాదేవిగారు దారిపొడుగునా చిరచిరలాడుచునే యున్నది. అమ్మా ఆవిడ కెప్పుడును అంత విసుగెందుకో?

సువ: అమ్మా మనయింట విద్యార్థులందరును క్షేమమా? పందెపు గిత్తల నేమిచేసివచ్చితిరి?

నాగ: మరల శకటపరీక్ష నెగ్గవలెనని యున్నది అన్నకు. పందెము గెలుతువేకాని ఇంకొక హిమబిందు నెచట తెత్తువు?

ధర్మ: అది ఏమితల్లీ! నీవు రెండుసారులు హిమబిందు మాట నెత్తితివి. హిమబిందు కుమారిని శ్రీ చారుగుప్తులవారు శ్రీకృష్ణసాతవాహనమహారాజునకు దేవిగా నర్పింతురు. చక్రవర్తియు, మహారాణియు నొప్పుకొనినారు.

సువ: మేము ఉజ్జయినినుండి వచ్చిన వెంటనే చారుగుప్తులవారు నన్ను కలసికొని, తన కొమరితను నేను రక్షించినందుకు నాకు కోటి ఫణము లీయ సంకల్పించు కొన్నాననియు. భావి యువరాజ్ఞి కాబోవు నామెను రక్షించి లోకమునకు నేను ఎంతయో యుపకారమును చేసినాననియు చెప్పినారు. నేను నాధర్మము నేరవేర్చినాను, నాకు కోటిఫణములు వలదనియు, నవి మధ్యవన మహాసంఘా రామమునకును, వ్యాఘ్రనదీ సంఘ రామమునకును ఇచ్చుట మంచిదనియు చెప్పితిని.

ధర్మ: అవును. చక్రవర్తి ఈ వివాహము నంగీకరించెను. మహారాణి ఆనందించెను. శ్రీకృష్ణసాతవాహన మహారాజు, హిమబిందుకుమారియు ఎంతయో ఆనందించు చున్నారు. ఈ విషయములు నాకు చారు గుప్తులవారే చెప్పిరి.

30. పాటలీపుత్ర పతనము

యుద్ధ మతితీవ్రముగ సాగుచున్నది. ఆంధ్రు లెంత జాగరూకత వహించినను మాళవసైన్యములు గంగమార్గమున పాటలీపుత్రములోనికి చొచ్చుకొని పోవుచునే యున్నవి. పాటలీపుత్రము బలము పొందుచునే యున్నది.

శుకబాణులవారి ఎత్తుగడ లన్నియు విఫలమగుచున్నవి. ముట్టడి కొన్ని నెలలు సాగినచో ఆంధ్రులకే నష్టముగాని పాటలీపుత్రములోని వారేమియు చెక్కుచెదరరు. యువరాజుచే ఉప సైన్యాధ్యక్షుని పద నియుక్తుడైన సువర్ణశ్రీ ఒకనాడు వారి అనుమతిని సర్వసేనాధ్యక్షుని సందర్శించెను.

స్వైత్రులవారికి సువర్ణశ్రీ వీరనమస్కార మిడి వారి యాజ్ఞను ఒక పీఠ మలంకరించి యిట్లు మనవిజేసెను. “మహారాజా! మాళవులు మనలను ఏమరించి పాటలీపుత్రములోనికి తండతండములుగ పోవుచున్నారు. వారిని నగరములోనికి చేరనీయకుండ చేయుట కొక

అడివి బాపిరాజు రచనలు - 2

• 235 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)