పుట:Himabindu by Adivi Bapiraju.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇది నిజమనినమ్మినారు ఎంతమందియో పండితులైన బ్రాహ్మణులే. ఈ విషయమున అమృతపాదునితో తాను వాదించి తీరవలయును. ఈ అమృతపాదుని తాను ఓడించి తనధర్మమునకు జేర్చగలిగినచో తన జన్మము సార్థకమగును.

ఈ ఆలోచనలతో స్థౌలతిష్యుడు తనగజము పై ఆరోహించి ప్రయాణము చేయుచుండెను.

ప్రతిష్ఠానమునుండి గయకడకు అతడు శిష్యగణముతో, నూరు ఏనుగులతో వచ్చుసరికి, ధాన్యకటకమునుండి వచ్చు కొన్ని కుటుంబము లచ్చట కలుసుకొన్నవి. ప్రియదర్శిసాతవాహనుని భార్య అమృతలతాదేవి ధర్మనంది కుటుంబము, కొందరు గోపసైనికుల వెంటబెట్టుకొని ప్రయాణము చేయుచు వచ్చుచుండిరి. ఆ జట్టులో భిక్షకు డగు వినయగుప్తుడు, శ్రీమంతుడగు కీర్తిగుప్తుడును ఉండిరి.

క్షేత్రగయలో స్థౌలతిష్య డాగిపోయిను. స్థౌలతిష్యుని కలుసుకొని కీర్తిగుహుడనేక విషయములు మాటలాడెను. తన మనమరాలిని తస్కరించిన దీ అపరవిశ్వామిత్రుడే యని యాతని హృదయమున స్థాలతిష్యునిపై కోప ముదయించినమాట నిజమే కాని మరల నేమిచేయుట కీ వృద్ధదుర్వాసుడు పాటలీపుత్రమునకు బోవుచున్నాడో యని కీర్తిగుప్తుడు కళవళపడెను.

ఆతని పేరు వినినంతనే అమృతలత మండిపోయెను. ఎక్కడనుండి దాపురించినా డీ ప్రళయరుద్రు డని యామె యనుకొనెను.

ఈ రెండుజట్టులు కలిసి ఒకేదినమున పాటలీపుత్రమును ముట్టడించిన శిబిరముల జేరిరి. పాటలీపుత్రమునకు ఇరువదిమైళ్ళ దూరమున గంగానదికి దిగువను ఒక గ్రామమునందు స్థాలతిష్యులు స్థావర మేర్పరచు కొనినారు.

ధర్మనంది శిబిరమునకు శక్తిమతీదేవియు, యామె ఇరువురు కొమార్తెలు చేరినారు. సువర్ణశ్రీ తల్లి పాదములకు సాష్టాంగనమస్కార మొనర్చి లేచి యామె కన్నుల నీరు తిలకించి,

“అమ్మా, ఎందుకా కన్నీరు?” అని ప్రశ్నించెను.

“నాయనా, నీవు క్షేమముగ నుంటివి. అదియే పదివేలు.”

నాగబంధునిక: మా అన్న ఎంత గొప్పవాడయినాడు!

సిద్ధార్థినిక: ఇప్పు డగుట యేమి! ఎప్పుడును గొప్పవాడే!

నాగ: ఓహోహో! చిన్నచెల్లెలుగారు అన్నగారిని వెనుక వేసుకొని వచ్చుచున్నది.

శక్తి: ఉండండి తల్లీ. నాన్నా! నిన్నుగురించి కథలు విన్నాను. బృహత్కథలోని వీరులవలె పేరుపొందినావు తండ్రి!

నాగ: తన నాయికను తాను రక్షించుకొన్నాడు.

సువర్ణశ్రీ: నాకు నాయికలేదు నాగూ! నాకు నా శిల్పమే నాయిక.

సిద్ధా: అటు లనుచుంటి వేమి అన్నా?

సువర్ణు డీలోననే సిద్ధార్థినికను ఎత్తుకొని గాఢముగ హృదయమున కదిమికొని, ఎగురవేసి, మరల పట్టుకొని, యాబాలిక ఋగ్గలపై కొన్ని వేల ముద్దుల వర్షము కురిపించి మరియు దింపెను. నాగబంధునికను తలనిమిరి ముద్దుగొని, భుజములుపట్టి, ఆడించి, వీపున చరచి వదలెను.

అడివి బాపిరాజు రచనలు - 2

• 234 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)