పుట:Himabindu by Adivi Bapiraju.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర సైన్యముల మహోత్సవములు జరిగెను. చక్రవర్తియు, మహారాణియు కుమారుల నిద్దర కౌగిలించుకొనిరి.

మంజుశ్రీ ఎదిగినాడు. బాలుడు, తల్లి ఒడిలో చేరి -

“అమ్మగారూ, మీరుక్షేమముగ నుంటిరా! నాకోసము బెంగగొంటిరా? బెంగ ఎందుకు జననీ! నేను ఆడపిల్లనా? మా అన్నగారు ఒక్కరు మిమ్ము వదలి పాటలీపుత్రమున ఉండలేదూ?” అన చక్కని, తీయని మాటలు పల్కినాడు. ఆనందదేవి పుత్రుని గాఢముగ హృదయమున కదుముకొని, ఆతనిమోమంతయు ముద్దులు పెట్టి “నా తండ్రీ! ఎంత పెద్ద మాటలు నేర్చినావు?” అనెను.

“అదేమి అమ్మగారూ! అట్లనెదరు? పెద్దఏమి? చిన్న ఏమి? అందరి ఆత్మలును ఒకటియ! నీవు పరమాత్మవు నేను పరమాత్మను. మాయచే మనము వేరు వేరని, బద్ధుల మని అనుకొనుచుంటిమి. మీరు భగవద్గీత చదువలేదా?”

“ఓయి నాయన! నా తండ్రి తత్వవేత్త అయినాడా? ఎవరు నేర్పిరయ్యా నీకీ చదువులు?”

"స్థౌలతిష్యులవారు. ఇంకను ఎందరో ఋషులు, నన్ను పెంచిన బ్రాహ్మణోత్తములు ఎన్ని విద్యలు నేర్పిరమ్మా నాకు! తల్లీ! మీరు భాసుని నాటకములు, వాల్మీకి రామాయణము, వ్యాసుని మహాభారతము చదివినారా? అవి యన్నియు నేను నేర్చుకొనుచున్నాను. మీకును నాయన గారికిని కొన్ని ఘట్టములు పాడి వినిపించెదను.”

“ఓహో! నా తండ్రి ఎంతటి పండితుడైనాడు! ఇన్ని నెలలు ఏమి చేయుచుంటివి? ఎవరు నీకు బువ్వ పెట్టిరి?”

హిమబిందును చారుగుప్తుడు తనహృదయమున కద్దికొని, ఆనందముచే, భార్య ప్రజాపతిమిత్ర తలంపున దుఃఖముచే కండ్ల నీరు వరదలై పార తల తడిపెను. హిమబిందు వాపోయినది. ముక్తావళీదేవి వెక్కి వెక్కి ఏడ్చినది.

తరువాత వారి ఆనందమునకు మేరలేదు. చారుగుప్తుడు చిన్నబిడ్డ వలె గంతులు వేసినాడు.

సువర్ణశ్రీ ధర్మనందికడకుపోయి, యాతని పాదముల కెరగెను. ఆ మహాశిల్పి. కుమారుని గాఢముగ కౌగిలించి, మనస్సులో బుద్ధదేవుని ప్రార్థించి, యాతని వదలెను.

శ్రీకృష్ణసాతవాహనుడు, సోమదత్తా చార్యులు, సమవర్తి సాతవాహనులు చక్రవర్తికి ఉజ్జయినీ యుద్ధ కృత్తాంత మంతయు నివేదించిరి. స్వైత్రులవారు, అచీర్ణులవారు అచ్చటనే యుండిరి. 

29. స్థౌలతిష్యమహర్షి

“చేయుటయే మన పని. దాని ఫలము మనది కాదు, అది భగవంతునిదే”, అనిగదా వాసుదేవుడు గీతయందు ప్రవచించినాడు. గీతామహా వాక్కు ఆశయప్రస్థాన మగు మహాపథము కంటకావృతమైననేమి యనిగదా వచించును. భగవంతుడే యట్లొనరించెను. భగవంతుని దారియే మాయ. కంసుని, నందుని, యశోదను, గోపికలను, కాలయవనుని, జరాసంధుని, శిశుపాలుని, కౌరవులను, అందరు జీవులను నిమిష నిమిషమున మాయచే నింపి, వక్రగతుల నడచిన భగవంతుడే మాయలమారియైనప్పుడు

అడివి బాపిరాజు రచనలు - 2

• 232 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)