పుట:Himabindu by Adivi Bapiraju.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మోహినియై రాక్షసుల మాయచేసి, దేవతలకుమాత్రము అమృతము పంచినప్పుడు, జగన్మోహినియై భస్మాసురునే భస్మ మొనరించినప్పుడు - వేదములు, ఉపనిషత్తులు, గీత, బ్రహ్మసూత్రములు, పరమశివారాధన, భగవద్భక్తి, ధర్మము వీనిని పునరుద్ధరించుటకు- నే నేమార్గమైన నవలంబించదగును” అని యాలోచించుకొనుచు స్థౌలతిష్యుడు శిష్యగణపరివృతు డై పాటలీపుత్రపురాభిముఖుడై ప్రయాణముచేయుచుండెను.

సాతవాహనవంశమును నిష్కల్మషముచేసి, దానిచేతనే ప్రపంచ మంతయు ఏలించవలె! దేవతాతృప్తి, మానవముక్తి ప్రసాదించు యజ్ఞ యాగాది క్రతువులు దేశమంతట జరగాలి. పాషండము, వైదికమార్గ నిరసము, మోక్షదూరము, నరకహేతువగు బౌద్ధధర్మము, జైనధర్మము నిశ్శేషం కావాలి. ఈ దినముల వర్ణభేదమే పోయినది. “చాతుర్వర్ణ్యం మయాస్వష్టం” అనే భగవంతుని వాక్కును నాశనము చేసినారీ బౌద్ధులు. వారే నాశనమగుదురు.”

తన మనుమరాలు విషకన్యను శ్రీకృష్ణసాతవాహనుడు వెంటబెట్టుకొనియే తిరుగుచున్నాడు. కాని ఇంతకాల మతడు నాశనమందకపోవు టెట్లు?

ఎవరా సువర్ణశ్రీ ? ధర్మనంది కుమారుడా? ఆ ధర్మనంది సువర్ణశ్రీల విషయ మావల కనుంగొనబడును. ఆతడు హిమబిందు వెంటాడుట ఏమి? తన నర్మదాశ్రమ రహస్య మాత డెట్లు భేదించెను? హిమబిందు మంజుశ్రీల కాతడు బంధముక్తిచేయుట యేమి? ఇదియంతయు విచిత్రమే. భగవంతుడేమి చిత్రసంఘటన కల్పించి ఈ నాటక మాడించి నాడో?

ఉజ్జయినికడ మాళవులు ఓడిపోవుటయు మంచిదే యైనది. లేనిచో వారు సర్వవిధముల భగవంతుని కార్యమునకు అడ్డుతగిలియుందురు. కాని పాటలీపుత్రముకడ బౌద్ధులు నాశనమయితీరవలెను. శ్రీముఖసాతవాహనుడు నాశము కావలెను. శ్రీకృష్ణు డెట్లును నాశనమైనట్లే! మలయనాగ ప్రభువును సాతవాహనులు చంపించిరని కింవదంతి వ్యాపింపజేయుటవలన ఆంధ్రనాగు లందరు అనుకొనిన దినమున ఆంధ్ర సైన్యములపై తిరుగబడి సాతవాహనులను వారి అనుయాయులను నాశనము చేయుదురు. మంజుశ్రీని మాత్రము వారు రక్షింతురు. ఆంధ్రసైన్యములలో నాలుగు లక్షలమంది యున్నారు. ఎందరో సేనానాయకులు, ఉప సైన్యాధికారులుగా ఉన్నారు. స్వైత్రులవారూ నాగప్రభువే యైనను బౌద్ధుడు. ఆతడే మలయనాగుని వెనుక చీవాట్లు పెట్టియుండెను. ఆతడే మలయనాగుని చక్రవర్తి యాజ్ఞచే చంపించెనని కదా తాను వదంతి పుట్టించెను?

ఎవరీ అమృతపాదార్హతులు? చాలా గట్టివాడు. బౌద్ధధర్మమును, ఆర్యధర్మమును ఆత డంత చక్కగ సమస్వయముచేయుట తన ఉద్యమము నకు భంగము కలిగించినది. చక్రవర్తి రెండు ధర్మములను సమముగ జూచుచున్నాడు. అది తన మహోద్యమమునకు ఎన్నియో చిక్కులు తెచ్చినది. ఈ అమృతపాదులు బౌద్ధధర్మము నిజమైన ఆర్యధర్మమని వాదించునట. బ్రతికియున్న ఆర్యజాతి యుగయుగమునను మార్పుచెందునట. కృతయుగానంతరము మహర్షులు ఉపనిషద్రూపమున వేదదేవతలకు స్వస్తి చెప్పిరట. అంతటితోడనే వైదిక దేవులమహాత్మ్యము ప్రజల హృదయము నుండి తొలగిపోయెనట! ఓహో ఏమివాదన! త్రేతాంతమందు ఉపనిషన్మతములోని భక్తిధర్మము, యోగధర్మము, సాంఖ్యమైన ద్వైతభావము తలయెత్తినవట. ద్వాపరాంతమందు అన్నింటిని సమన్వయము చేయు భగవద్గీతను భగవంతుడే స్వయముగ బోధించెనట. కలియుగములో ఇట్టి అవతారము లెన్నియో రావలెనట. బుద్ధు డట్టి అవతారమట!

అడివి బాపిరాజు రచనలు - 2

• 233 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)