పుట:Himabindu by Adivi Bapiraju.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 కాని గోండులు బహుపరాక్రమవంతులు. గోండుయువకుడొంటియై సింహమునే ఎదుర్కొనును. గోండుమహాప్రభువు వీరమల్ల గోండమహారాజు సాతవాహన సామంతేశ్వరుడు. ఆతని పుత్రుడు మహామల్లగొండ యువరాజు ధాన్యకటక మహా సంఘారామ పరిషత్తునందు విద్యనభ్యసించినాడు. అప్పుడే సువర్ణశ్రీకిని ఆతనికిని గాఢస్నేహము కలిగినది. మహామల్లుడు సువర్ణశ్రీ ఇంటనే వాసముచేయువాడు. వారి ఇంట భుజించువాడు.

ధర్మనందియు, సువర్ణశ్రీయు దేవతలని వారి శిల్పములు చిత్ర లేఖనములు జూచి మహామల్లు డనుకొనువాడు. గోండు భాషలో తీయని పాటలు బాడుచు, అవి సువర్ణశ్రీచే బాడించుచు, చిన్నబిడ్డ యగుసిద్ధార్థినికను ఒక్క నిమేషమైన క్రిందకు దింపక ఆడించుచు, శక్తిమతీదేవికి రెండవ కొమరునివలె మెలగినాడు.

సువర్ణశ్రీ బయలుదేరు నప్పుడే మహామల్లుని తలచుకొన్నాడు. అత డప్పుడే యొక ఉత్తమ గోండసామంతునితనయను వివాహమైనాడనియు, యువరాజ పట్టాభిషేకము నందినాడనియు సువర్ణునకు దెలియును.

తనకు వార్తలంపు విధానము సువర్ణునకు మహామల్లుడే తెలిపినాడు. గిలనకేరపురము పుళిందరాజ్యమునకు దక్షిణమున నున్నది. పుళిందులు ఆంధ్ర సాతవాహనులకు దాసులయ్యు, నేడు స్థౌలతిష్యుని మహిమవలన వారికి విరోధులై ఆంధ్ర సామ్రాజ్యమును విచ్ఛిన్నముచేయ సంకల్పించియుండిరి. కాని పుళిందులలో కొన్ని జట్టులనాయకులు శుకబాణుని అనుయాయులు. వారును గోండునాయకులును రహస్యముగ నెప్పటివార్త లప్పటికి శుకబాణునకు తెలియజేయుచుండిరి.

తన స్నేహితుడగు పుళిందయువక నాయకు డొకడు గిలనకేరపురమున నుండుననియు, నాతడు తనకువార్త పంపగలడనియు, తాను గోదావరి కావల ఉత్తరమున మూడు యోజనములు దూరముననున్న నగరిగ్రామమున కలుసుకొందుననియు మహామల్లగోండుడు తాను ధాన్యకటకనగరము వీడునప్పుడు తెలిపియుండెను. ఆనవాలుగా తన దండకడియము సువర్ణశ్రీ కిచ్చినాడు.

గిలనకేరపురమున నాగినప్పుడే ఆ పుళిందనాయకుని గలుసుకొని సువర్ణుడు మహామల్లుని దండకడియము సందేశ మంపినాడు. నగరి గ్రామమున రెండు దినములు విశ్రమించినాడు. దీర్ఘ ప్రయాణముచే అలసట నొందిన ఆతని ఉత్తమాశ్వమునూ అలసట తీర్చుకొని పదనుపట్టిన కరవాలమువలె మెరసిపోయినది.

మూడవనాటికి మహామల్లుడు పుష్కలమహా మేఘమువలె గజయూధ పతివలె వచ్చి సువర్ణుశ్రీని కౌగిలించుకొనెను.

“అన్నా! ఏమిది, ఈ అడవుల సంచారము చేయుచున్నావు? భగవంతుని శిల్పము, చిత్రలేఖనము దర్శింపవచ్చినావా?”

“మహాబలా! నేనొకనాడు నీ రాజ్యమున నిన్ను దర్శించెదననలేదా? నేడు వచ్చినాను. కాని, సంతోషయాత్రాభిముఖుడనై కాదు. పవిత్రకార్య దీక్షాపరుడనై వచ్చినాను. నీవు తప్ప ఇంక నేరును నాకీ దుర్ఘటకార్యమున సహాయము చేయలేరు.”

సమున్నతరూపుడు అతిరధుడు నగు సువర్ణుడును, మహాబలావతార మగువాడును, మధ్యమోన్నతమూర్తియు నగు మహాబలగోండుడు బిగియార కౌగిలించుకొన్నారు.

అడివి బాపిరాజు రచనలు - 2

* 169 *

హిమబిందు (చారిత్రాత్మక నవల)