పుట:Himabindu by Adivi Bapiraju.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“మహాప్రభూ! మనము కళింగము పొలిమేర చేరునంతవరకు శత్రువులు మనపోకడ కనిపెట్టలేరు. కాని అక్కడనుండి విదేహమున కేగక ఉత్తరముగ బోయినచో వారికి నిజము తెలియదా” యని మనవి చేసికొనెను.

ఇంతలో మహామంత్రి అచీర్ణులు, చారుగుప్తుడు అచ్చటికి వచ్చి అనుమతినంది, యథోచితముగ బ్రవేశించి ఆసనము అలంకరించిరి.

స్వైత్రులవారు తమ అనుమానము వారికి వెల్లడించిరి.

చారు: తమకు అనుమానమెందుకు మహారాజా! వారిని నిజము తెలిసికొననిండు. పాటలీపుత్రమునందు ఏబదివేల సైన్యముమాత్ర మున్నదని మన వేగుకదా?

అచీర్ణుడు: ముట్టడించిన మనసైన్యమును, సుశర్మస్నేహితులు వచ్చి తాకరా?

చారు: అవుగాక, అందువలన భయమేమి? మన సైన్యముముందర ఆ వచ్చు సైన్యము లేపాటి వగును?

శ్రీముఖుడు: నిన్న ఉజ్జయిని వార్తనుబట్టి మనవేగులవారిదళములు కోటలోనికి చేరినవని తెలియవచ్చినది. పదునేనుదినములవరకు భయము లేదని శుకబాణుని వార్త.

29. ప్రయోగభంగము

“అగ్నిమీ ళే పురోహితం యజ్ఞ స్య దేవ మృత్విజమ్
హోతారాం రత్న ధాతమం.”

ఇట్టి మంత్రములతో అగ్నిని అర్చించి, ఇంద్రాదిదేవతలను ప్రార్థించి, స్థాలతిష్యుడు విషబాలను శ్రీకృష్ణసాతవాహనునిపై ప్రయోగించు హోమములు సలిపెను. ఆమె పద్మాసన పీఠముపై కూర్చుండియుండ మంత్రములతో ఆమెకు షోడశార్చన స్థాలతిష్యులు జరిపెను.

ఆమెలోనికి సర్వమృత్యువులు ఆహ్వానింపబడెను.

“నిన్ను జూచినంతనే జీవములు హత మొందును గాక.”

“నిన్ను స్పృశించినతోడనే మనుష్యులు బూదియైపోవుదురుగాక.”

“నిన్ను పొందుటతోడనే విగతజీవులై మనుష్యులు నశింతురుగాక.”

అను నర్థముగల మంత్రములు పఠించుచు స్థౌలతిష్యు డామెను ప్రయోగించ బోవుచుండ, ఆమె చివ్వున లేచినది.

“తాతగారూ! ప్రయోగించకుడు. నేను ఒప్పను. నేను మృత్యువును కాను” అని అరచినది.

ఆమె కన్నులలో గాఢవిషాదరేఖలు మబ్బులరీతి ప్రసరించినవి. ఆమె సుందరమైన పెదవులు వణకిపోవుచుండెను. ఆమె పిడికిళ్ళను గట్టిగా ముడుచుకొని హృదయమున కద్దుకొనియున్నది. శార్దూలమును జూచిన హరిణమువలె, పామును చూచిన కప్పవలె ఆమె గజగజ వణకి పోవుచుండెను.

ఈ ప్రయోగము జరుగు పూజామందిరమున, ఆ ప్రయోగపు తంతుకు వలయు బ్రాహ్మణులు మాత్రమున్నారు. గగని మొదలగు కాపాలికలున్నారు. ఇతరు లెవ్వరు నా మందిరమునలేరు.

అడివి బాపిరాజు రచనలు - 2

• 150 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)