పుట:Himabindu by Adivi Bapiraju.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సైన్యము బయలుదేరుటకు గొన్ని దినములముందే మెరికలవంటివేయి మంది యదార్హవర్ణులు, మాయావర్తనులు సంశప్తకులు ఉజ్జయినీ సైన్యములకువలయు ముఖ్యసామగ్రిని సేకరించి, మందులవారివలె, కాపాలికులవలె, జైనసన్యాసులవలె, బ్రాహ్మణయాత్రాపరులవలె, బిచ్చగాండ్రవలె బండ్లతో, ఏనుగులతో, అశ్వములతో బయలుదేరిపోయిరి. ఏదారిని ఎవరు ఎట్లువచ్చిరో! వారందరు ఉజ్జయినిని ముట్టడించు శివస్వాతి కళింగ సైన్యమున చేరిపోయిరి.

సముద్రమున గురిసిన వానతుంపురులవలె, తెల్లవారుఘడియల శాద్వలములజేరిన హిమబిందులవలె, నారికేళముల జేరు జలబిందులవలె కళింగసైన్యమున గలిసిపోయిరి.

ఇంతలో వారు నాటకమాడినారు. ఆంధ్రాపసర్పనాయకుడు శుకబాణుడు శివస్వాతి వేషము వేసినాడు. ఆతనికి చిలుకయని పేరు. ఆతని గుర్తు ఆకుపచ్చ ఈకలు, ఎర్రని చువ్వగల బాణము. ఆతనిచారసైన్య మతినిపుణము. ఈ చార సైన్యము ఆడిన కపట నాటకముచే ఆహారవస్తువులు, మందులు, ఆయుధములు, వస్త్రములు, గజతురగాదులు కోటలో ఎట్లుచేరినది పఠిత లెరుంగుదురు.

ఆ చేరినవార్త చక్రవర్తికి వెనువెంటనే అందజేసిరి.

చక్రవర్తి తాను యుద్ధయాత్రకు బయలుదేరుచు శ్రీకృష్ణశాతవాహనునకు గమ్మయొకటి పంపినాడు. శ్రీకృష్ణశాతవాహనుడు చక్రవర్తి ఏర్పరచిన మంచి ముహూర్తమున వేటకు బయలుదేరినట్లు బయలుదేరవలయు ననియు, ఆతని సైన్యములు వేయి, రెండువేలమంది జట్టులుగా విడిపోయి, మహారధిరాష్ట్రము, రధిరాష్ట్రము, కుంతల దేశము తిరిగినట్లు నటించుచు త్రయంబకేశ్వరపర్వతముకడ చేరవలయుననియు నచ్చటనుండి ఆభీరులు కన్నుమూసి తెరచులోపల నొక లక్షసైన్యము భరుకచ్చము పోయి యది పట్టుకొనవలయుననియు, నచ్చట ఏబదివేల సైన్యముంచి, తక్కిన సైన్యముతో శ్రీకృష్ణశాతవాహనుడు ఉజ్జయినిని ముట్టడించిన రిపుల దాకవలయుననియు, ఆ సమయముననే చక్రవర్తి విదేహముదారిని ఆరువదిఅయిదు యోజనములు ప్రయాణము చేయించి రెండు లక్షల సైన్యము పంపుమనియు, కోటలోనివారు, ఈ రెండు సైన్యములు ఉజ్జయినిని రక్షింప గలవనియు వేగు పంపినారు.


దారిపొడుగునను చంద్రస్వామి సామ్రాజ్ఞి ఆనందదేవికి వేదాంతము, పురాణములు చెప్పుచుండెను. బౌద్ధజాతక గాథలు మనోజ్ఞవిధానమున ఉపన్యసింపుచుండెను. బుద్ధుడు విష్ణుని యవతార మని యాతని భావము. ఆ యవతారభావ మాతనిహృదయమున బ్రవేశపెట్టినది అమృత బాదార్హతులు.

చారుగుప్తుడు దారిపొడుగున చేసిన ప్రయాణసౌకర్యములు పరమా ద్భుతములు. రెండు లక్షల సైన్యము ఇంచుకంతైన శ్రమనందక ధాన్యకటక నగరమున నున్నట్లే సౌఖ్యములనందుచు బాణవేగమున సాగిపోవు చుండెను.

శ్రీముఖశాతవాహనుడు చారుగుప్తుని దూరాలోచనకు, ప్రజ్ఞకు, ఆతని తరుగని సంపదకు ఆనందము, నాశ్చర్యము నందుచుండెను.

కుంతిపురము ముహాచైత్యమున ప్రార్ధనలు సలిపిరి. సర్వసైన్యాధ్యక్షులగు స్వైత్రులవారు సార్వభౌముని బంగారుగుడారమునకు బోయి జయ నాదమొనర్చి సార్వభౌమునిచే చూపబడిన ఆసనమున అధివసించి,

అడివి బాపిరాజు రచనలు - 2

• 149 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)