పుట:Himabindu by Adivi Bapiraju.pdf/153

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డదిమాళవసైన్యనాయకుడైన శివస్వాతియు, మగధ సేనాధిపతియు, పుళిందరాజును, సౌరాష్ట్రసేనాధిపతియు ప్రతిరాత్రియందు మాళవరాజు సువర్ణశిబిరమున మాళవాధిపతిని దర్శించుచు, యుద్ధవిధానము నిర్ణయించి దాని ననుసరించుచుండిరి. నగరములో కొద్దిసైన్యమున్నపుడే త్వరలో నిర్షించి, కోట స్వాధీనము చేసుకొన లేకున్న, ఇక ఆంధ్రసైన్యములన్నియు వచ్చినచో ఈ రెండు మహాగ్నులమధ్యనుండి మగ్గిపోవలసినదే మాళవాదులు.

సమదర్శికి ఇంతవరకు చక్రవర్తికడనుండి వార్తలేమియు జేరలేదని కొంచెము ఆతురత కలిగినది. ఆయుధములు తరిగిపోవుచున్నవి. లగ్గల మీద కరిగించిపోయు సీసము నిండుకొనుచున్నది. ఆయుధములను, యంత్రములను నిర్మించుటకు లోహాదులు చాలుటలేదు. నగరప్రజలలో చాలమంది ఆంధ్రులకు వ్యతిరేకులు. తన సైనికులకు భోజనము, నగరప్రజలకు భోజనము చూచుట బ్రహ్మప్రళయ మగుచున్నది. ధైర్యమే ఆయుధములై, యంత్రములై ఎంతకాలము ఉపకరించగలదు? విరోధులు ధర్మయుద్ధము పరిత్యజించి రాత్రియనక, పగలనక, ఒత్తిడి తగ్గించక, ముట్టడి సాగించు చున్నారు.

అందమైన యా నగరమున ప్రజలందరు సరియైన తిండిలేక నిద్రలులేక ప్రేతములవలె నున్నారు. కవులతో, పండితులతో, గాయకులతో, వర్తకులతో, భక్తులతో, వేదాంతులతో, భిక్కులతో నిండియున్న యా మహాపురము భయంకర రోగానిష్ఠుడగు మహాపురుషునివలె నిస్తేజమై వెలవెలపోవుచుండెను.

ఇంతలో నొకనాడు సాయంకాలము నగరములోనికీ రహస్య చారు డొకడు చిత్రముగా వార్త నంపినాడు. ఆత డాంధ్రచారదళములలో నద్భుత ప్రజ్ఞావంతుడు. ఆతడు వేయలేని వేషము లేదు. మాటలాడనీ భాషలేదు. ఒక రోజున శివస్వాతి మహావేగమున అశ్వమెక్కి ఉజ్జయినికున్న అష్ట గోపురమార్గములలో నొకదానికడకు వచ్చెను. కళింగసైన్యములలో కొన్ని యచ్చట యుద్దము చేయుచుండెను. ఉపసేనానాయకు లతనికి వీరనమస్కారము లర్పించిరి.

అతడు వారితో యుద్ధరహస్యములెన్నియో మాటలాడి, స్వయముగ ఆజ్ఞల నిడి, కోటగోడలపైకి సైన్యముల నెసకొల్పేను. కోటగోడపై మహా విక్రముడైన సమదర్శి నిలబడి ఆంధ్రధనుర్ధరులచే చాపములు చేవికంట లాగించి పుంఖానుపుంఖములుగ బాణములు విడిపింప చేసెను. ఆంధ్రులు ధనుర్యుద్ధమం దసమానులు. వారి బాణము లెట్టి కవచములనైన అవలీలగ ఛేదించుకొనుచు గుండె దూసిపోగలవు. ఆంధ్ర విజయములకు ప్రధాన కారణము వారిధనుర్విద్యాపాటవము. ఆ బాణము లమీతధ్యోమములు.

శివస్వాతి సమదర్శిని చూడగనే ఆకుపచ్చని ఈకలతో ఎఱ్ఱని చువ్వతో గోళశిరస్సుగల బాణమును సువ్వున ధనస్సులాగి అతివేగమున వదలెను.శివస్వాతి ఆ నమస్కార బాణము వదలుట కళింగదళముల వారెవ్వరు కనుగొనలేదు. ఆ బాణము రివ్వునవచ్చి సమదర్శి పాదములకడ పడెను.

ఆ బాణమును చూడగనే సమదర్శి సంతోషమున నొక గంతువైచి, వంగి, ఆ బాణమును తీసికొని, తనపరశు ముఖముతో గోళము బద్దలుకొట్టుటయు, నందుండి యొక భూర్జపత్రముపైకి వచ్చెను. వెంటనే సమదర్శి పత్రము విచ్చి యిట్లు చదువుకొనెను.

“సేనాపతీ! ప్రణామములు. సింహము అరణ్యములందు తానున్న గుహవదలి తిన్నగ ఆ వృద్ధసింహ మున్న గుహకడకు పోవుచున్నది. ఆ సమయమున కొన్ని

అడివి బాపిరాజు రచనలు - 2
హిమబిందు (చారిత్రాత్మక నవల)
• 143 •