పుట:Himabindu by Adivi Bapiraju.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింహశాబకములు తాము వేటాడిన జింకల బట్టుకొని మూలుగుచున్న ఆడసింహముకడకు కొనివచ్చుచున్నవి. ఏనుగు లేమి చేయును, నక్క లేమి చేయును? అమృతపాదసాక్షిగ అవసరములు ఆరవ యామమున ఆరవలోయలో ఆ ఆడుసింహమునకు దొరకగలవట. నేను నాదారిలో చూచిన దృశ్యము. పచ్చరేకు చిలుకముక్కున దొండపం డుండలేదు. ఒక పద్య మున్నది.”

అని వ్రాయబడియుండెను. తిరిగిచూడ అచట శివస్వాతి మరి కాన్పించలేదు. చిలుకయే వచ్చినది. ఇక ఆంధ్ర సైన్యములకు వేయిరెట్లు బలము వచ్చును. తిండి వచ్చుచున్నది. చక్రవర్తి ఇంక కొన్ని నెలలు ఆలస్యముచేసిన భయ మేమి? ఆరవలోయ, ఆరవనగరగోపురము, ఆరవ యామము (రాత్రి రెండవయామము). ఆతడు విసవిస నడచుచు మహావేగమున వినీతమతికడకు బోయి శుకబాణుని లేఖ చూపించెను. వినీతమతి ఆనందమునకు పరిమితియే లేదు. సమయమునకు తగిన సహాయము చక్రవర్తి పంపినాడు. ఆ మహాభాగుని వంటి దూరాలోచనాపరులు మరిలేరు.

ఆరవగుమ్మముకడ కళింగసైన్యములు సంభ్రమాశ్చర్యములలో మునిగి మహా యుద్ధము చేసినవి. ఇంతలో కోటగుమ్మము తెరువబడి మెరికలవంటి ఆంధ్రవీరులు ఒక వేయిమంది ఛంగున అక్కడకు వచ్చి కళింగుల దలపడిరి.

“జై అమృతా” అనుచు వేయిమంది కళింగులు ఆంధ్రసైన్యముల తలపడిరి. ఆంధ్రులు పారిపోయిరి. వారిని వెన్నంటి ఆ కళింగాశ్వికులు, ఇరువది కళింగ గజములు, పదాతులు, పది రథములు ఆంధ్రులను తరుముకొనుచు కోటజొచ్చిపోయినవి.

ఆంధ్రు లంత త్వరితముగ పారిపోవుదురని తక్కిన కళింగసైన్యములనుకొనలేదు. వారికి శివస్వాతియే నాయకుడై సైన్యముఖమున నుండెను. గుమ్మముజొచ్చిన తమ సైన్యమువెంట తక్కిన కాళింగులు వెళ్ళ సాగినంతనే, ముందున్న కళింగ గజవీరులు గజముల పైనుండి ఒక్కమాటు తమమీదనే బాణములు పరపిరి. “జై శ్రీముఖశాతవాహన మహారాజా” అనుచు ఆ గజవీరులు తమ గజముల వెనుకకుద్రిప్పి, అగడ్తపై నున్న వంతెనమీదనుండి తమ్మంటివచ్చు ఇతర కళింగసైన్యముల నిలువరించిరి.

సంభ్రమాశ్చర్యములతో కళింగసైన్యములు ఆగిపోయినవి. గజములు వెనుతిరిగి లోనికి బోయినవి. మహాద్వారములు మూసుకొనిపోయినవి. లగ్గల పైనుండి అగ్నివర్షము, బాణవర్షము మహాథారులైనవి. కళింగులు వెనుకకు పారిపోయినారు. శివస్వాతి “ఎంత మోసము జరిగినది” అనుచు దలవ్రేలవైచెను.

27. గ్రీష్మాతపము

నిప్పులు చెరుగుతున్నది రోహిణీకార్తె తన్నిదాఘమాస బ్రథ్నదేవ మహోష్ణము భరింపలేక, తన పాతివ్రత్యధర్మమునైనతలంపక సంజ్ఞా దేవియే బాడబియై సముద్రము చొచ్చినది.

ధాన్యకటకనగరవీధులయందు మధ్యాహ్న మొక్క ప్రాణియైన గోచరించుట లేదు. తోటల చెట్లన్నియు చిగురించి కొత్త ఆకుల దొడిగినవి. పొలమున నొక పచ్చమొక్క అయిన కనబడుటలేదు. కృష్ణాదేవి, మహాతపస్సు నొనరించు పార్వతివలె ఆ సైకతముల నొదిగిపోయినది.


అడివి బాపిరాజు రచనలు - 2

• 144 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)