పుట:Himabindu by Adivi Bapiraju.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“మా తాతగారు ఎప్పుడును నాశనముకారు. నేను ముట్టుకొనిన గోదావరినీరు నాశనమగునా? నేను కౌగిలించిన ఆ కొండలు నాశన మగునా? అట్లే మాతాతగారును.

“ఆ కొండలు, ఆ నదులు మాట్లాడవు. మీ తాతగారు మాట్లాడుదురు!”

“ఓ వెర్రిగగనీ!ఆ గగనము నాతోమాత్రము మాట్లాడును. నీవు అందరితోడను మాట్లాడుదువు. కనుక మాట్లాడుట ముఖ్యము గాదు. మా తాతగారు పురుషులు కారు, స్త్రీలును కారు, వారు దైవము.”

“దైవమంటే?”

“మాతాతగారు నీవు, అగస్తి, కాశ్యపి మొదలగువారు పూజ సేయుదైవము.”

“దానికేమిగాని, ఎవరు నాశనమగుదు రందువు?”

“పురుషులు. నాబోటి బాలకలను గట్టిగా గుండెలకు అదుముకొను నూనూగు మీసములపురుషులు. మలయనాగునివంటివారు.”

“అమ్మయ్యో! ఇది ఎట్లు నీకు తెలిసినదమ్మా? ఎవరు చెప్పిరి?”

గగని ఒడలు జలదరించినది. ఆమె కన్నుల భయము నిండినది. ఆమె ఇటు నటు పారచూచినది.

“నేను చూచితిని. వారిరువురు ఎంతో సంతోషముగా నున్నారు. గగనీ! నిన్నెవరైన అట్లు కౌగిలించారా? స్త్రీ పురుషులు పెనవైచికొనుట అంత సంతోషమా? మొన్న బండ్లమీద ఈ యూరు ప్రయాణముచేయు నప్పుడు మనము ఇక సెలయేటి ప్రక్కను అగినాము కాదూ!”

“అవును, అక్కడ ఏమి జరిగినది!”

“అక్కడనొక పొలము, అందు రెండు నేరేడుచెట్లు చూడలేదా!”

“చూచితిని.”

“ఆ నేరేడు చెట్లనీడ ఒక పొలముకాపు, అతని భార్యయు, ఒక చిన్న బాలుడు, రెండెడ్లబండి చూడలేదా?”

“నేనంత పరిశీలించలేదు.”

“వారంద రక్కడ సంతోషముగా నున్నప్పుడు వారిని చూచి మన బండివాడొక పాట పాడినాడు. అది వింటివా?”

“లేదమ్మా! నా గొడవ నాది. ఏమని పాడినాడు?”

“విను,

పాఅపడిఅస్స పఇనో పుఠ్ఠిం[1]
పుత్తే సమారుహత్తమ్మి
దడమణ్ణుదుణ్ణిఆయే విలాసో
ఘరిణీయే నేక్కంతో

(గాథాసప్తశతి) ఆ పాటలు విని, ఆ పురుషుని, ఆ స్త్రీని, ఆ పాపని చూచి ఎంతో ఆనందమైనది. గగనీ! నాకును అట్టిపాపడు పుట్టి నాతో ఆడుకొనునా? నా ఒడిలో ఒక పురుషుడు వాలిపోవునా?”

  1. *అడుగుదమ్ములందు పడి వేడుపతివీపు చిన్నికొమరు డెక్కి చెలగియాడ అలుక ఎంత తెగని దయ్యును నిల్లాలిమోమునందు నవ్వు మొలచినపుడు. (రా.అనంతకృష్ణశర్మగారి భాషాంతరీకరణము)

అడివి బాపిరాజు రచనలు - 2

• 141 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)