పుట:Himabindu by Adivi Bapiraju.pdf/121

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


గాఢముగ ప్రవహింపవలసినదే. ప్రణయ మననేమో ఆమె నేటికి ఎరిగినది. ఆమె నలయించు అస్థిరతకు జాలు దొరకినది. నిండారి. నిర్దుష్టమై. నిర్వక్రమై ఒంటివారు సువర్ణశ్రీకుమారజీవిత ప్రవాహమున నామె ప్రవేశించినది. ఏల తా నాతని ప్రేమించినదో యా కుమారికి తెలియదు. ఆతని సోయగము మచ్చలేనిది. బలమున నాతడు మంజుశ్రీయే. మరి? అతనికి సోగమీసములు లేవు. కన్నులలో కెంపు వెలుగు లేదు. పెదవుల చివర గుండె లదురచేయు లఘుహాసము లేదు. ఓహో! ఆతడు దేవతామూర్తి.

సువర్ణశ్రీది నూత్నయౌవనము. రాగరక్తిమ లలము శుభముహూర్తమది. సౌందర్యా రాధకుడగు నాతని అచ్చహృదయమున భగవదతీత సుందరభావ ముదయించినది. దాని నాతడు శిలలో, రంగులలో రూపెత్తించుచుండ, నది సజీవమై హిమబిందున సాక్షాత్కరించినది. అంతటితో నవతుషారార్ధ్ర మగు నరవిందమువోలె నాతని హృదయము విరిసినది. ఆ కమలముపై హిమబిందు అధిష్టించినది. ఆ దేవి తన్ననుగ్రహించినది. బహుజన్మ తపఃఫల మాతని ననుసరించినది. ఆ దేవిసేవయే ఆతడు కోరునది. ఆ సేవలో నాతనికి సృష్టి యంతయు రసమయ మగుచున్నది. దైహికము లగు పరిష్వంగాదు లా సేవా కలాపము.

సువర్ణ: బిందూ! మాటాడవేమి?

హిమ: నాకు మాటలు రావు.

సువర్ణ: నీపేరంత మధుర మేమి?

హిమ: మీ పేరులో అంత బంగార మేమి?

సువర్ణ: ఇన్నిరాత్రులు సృష్ట్యాదినుండి వెళ్ళిపోయినవి. ఈ రాత్రియంత అందముగ నుండినదా?

హిమ: ఆ కోకిల అంత అందముగ పాడగలిగినదా ఇదివరకు? కృష్ణానది నన్ను చూచుచున్నది. నాకు సిగ్గువేయుచున్నది.

సువర్ణ: అయినచో నా యీ హృదయమున దాగుకొనరాదా?

హిమ: శిల్పులహృదయములో రాళ్ళు, రప్పలు ఉండును. అదిగో! అంత దగ్గరకు మీరు రాకూడదు.

సువర్ణ: పోనీలే! నేను దూరముగనే కూర్చుండెదను.

హిమ: మీకు దగ్గరయు, దూరము నొక్కటేకదా!

సువర్ణ: నిజమేకాని, నీవు నా కారాధ్యదేవతవు. నిన్ను చేతులార నేను పూజించుకొనవలెను.

హిమ: ఆ పూజలు మీయింట నున్న విగ్రహమునకు జేసికొనుడు. నేను బాలికామాత్రను. చారుగుప్తులవారి కూతురను. నన్ను మీరు పూజింపనూ రాదు, అంటనూ కూడదు.

ఈ మాటలు విని సువర్ణశ్రీ ప్రకృతిస్థుడైనాడు. కుబేరవిభవు డగు చారుగుప్తుని తనయను తానిట్లనదగునా? తనవంటి నిర్భాగ్యుల కట్టిదేవత యెట్లు లభ్యమగును?

అతని కళవళపాటును హిమబిందు గ్రహించినది. “ప్రొద్దుపోవు చున్నది” అనుచు లేచి అతనిచేయిపై కెంగేలు వైచినది.

వేయి పరీమళములు వికసించు స్వర్ణ దీతరంగలాలిత దివ్యకమలము ఆతని స్పృశించినట్లయినది. కరడుకట్టిన మహాశిల్పికాంక్షపోలె కృష్ణాతీరమున సౌందర్యశ్రీ మూర్తియై కోటియౌవన తపఃఫలంబులు వోలె విలాసరూపయైన ఆ దేవత నాత డాఘ్రాణించి హృదయమున జేర్చుకొనెను. ఆమె పాదములకు బ్రణమిల్లెను.

అడివి బాపిరాజు రచనలు - 2
హిమబిందు (చారిత్రాత్మక నవల)
• 111 •