పుట:Himabindu by Adivi Bapiraju.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆమె చీనాంబరపుచెరగులో మోము కప్పకొని, తలవంచి, మోకరించి, యామె పాదములపై మోము నుంచి, నందనవనవాటికా వికసిత మందారపుష్ప దళములవలె నున్న ఆమె పాదాంగుళుల ముద్దుగొన్నాడు. ఆమెమీగాళ్ళ పెదవులు చేర్చినాడు.

హిమబిందు ఆనందపులకితయై, చకితయై, పరవశయై, కన్నులు మెరసిపోవ, అశ్రుబిందువులు తిరిగిపోవ, శ్వేత తారహార సుందరము లగు హస్తముల ఆ భక్తునితలపై నిమురుచు, ఆతని మో మెత్తి, కన్నుల ముద్దిడికొని, యాతని పెదవుల దనమనోరాగమును ముద్రించి, “రేపువద్దు, పై శుక్రవారము” అనుచు త్వరితముగ నడచి యా చీకటులలో మాయమయ్యెను.

14. గౌతమి

త్య్రంబకేశ్వరజటాజూటనిర్గత యగు గౌతమీకుమారి నాసికా సంఘారామ క్షేత్రమునకు వచ్చునప్పటికే శైశవము వదలి బాలిక యైనది.

ఆమె ఆటలలో అనంతకాలనర్తనము లున్నవి. ఆమె పాటలలో శబ్దబ్రహ్మానంద తరంగములు ఊగిపోవుచున్నవి. సహ్యాద్రిసానువుల నెన్నియో యలంకరణము లామె సమకూర్చుకొని యా లోయలలో విహరించుచు ఎందరినో శైవలినీ బాలికల తనలో లీనము గావించుకొనుచు, ప్రతిష్ఠాన నగరముకడకు వచ్చునప్పటికి యౌవనవతియై, హొయలు మెరయు క్రీగంటి చూపులతో, కులుకు నడలతో మందగమనమై నడచి పోవుచున్నది.

ప్రతిష్ఠా నగరమునకు కొలదిదూరమున గోదావరీనదీతీరమున స్థౌలతిష్యమహర్షి యాశ్రమ మొకటి యున్నది. స్థౌలతిష్యునికి సకలభారతావని యందును ఇరువది ఏడు ఆశ్రమము లున్నవి.

ఒకనాడా ఆశ్రమమునకు ఆంధ్రసామ్రాజ్యయువరాజు శ్రీకృష్ణశాతవాహనుడు క్రీడారథమెక్కి నలుగురు చక్రరక్షకులు వెంటరా నరుదెంచి, గోపురముకడ రథము నాపి అందుండి అవరోహించెను.

***

సార్వభౌముని జన్మదినమహోత్సవములన్నియు నైనవెనుక ఒక శుభముహూర్తమున యువరాజు ప్రతిష్టా నగరమున కేగ తల్లిదండ్రుల యనుమతిగొన సార్వభౌముని దర్శనమునకై యనుజ్ఞవేడినాడు. ప్రతీహారిణులు వచ్చి “దేవా, ఇటు, ఇటు” అని దారిచూపుచు సార్వభౌముడున్న శ్రీమందిరమునకు గొనిపోయిరి.

“జయ! జయ! చతుస్సముద్రవలయిత జంబూద్వీపాధినాథా! జయ! ఐక్ష్వాకు, బృహత్పలాయన, ఆనంద, సాలంకాయన, మాఢార, నాకాటకాది మహామండలేశ్వరరాజిత మహాసఖా! పూజితమహాశ్రమణపాదుకా! సర్వ ధర్మరక్షణ బిరుదాంకితా! శ్రీ శ్రీ కౌశికీపుత్ర శ్రీముఖశాతవాహన సార్వభౌమా! జయ! మయ! మాళ్వాభీరానర్తకొంకణాది సర్వదేశ విజేతలు శ్రీ శ్రీ ఆనందీపుత్ర శ్రీకృష్ణశాతవాహన మహారాజులంవారు దర్శనార్ధము వేంచేసినారు” అని వారు విన్నవించినారు.

అడివి బాపిరాజు రచనలు - 2

• 112 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)