పుట:Himabindu by Adivi Bapiraju.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చారు: నిజమే. ఇదివరకు చారుగుప్తునితో పందెమువేసి యెవ్వరును జయమొందలేదు. ఇప్పుడు ఈ కోడెల నడుపు మగటిమి గలవాడు లేక మన మోడిపోయిన తలవంపులు. సమవర్తియే బండితోలుగాక.

ఇంద్ర: కాని....

చారు: “కాని” యని మాట్లాడకూరకుండెదమేమి? అంతకన్న ధాన్యకటక నగరమున సారథి యెవ్వడు? అతని నిదివరకొక్కరైన మఱి ఓడించిరా? ఎంత పొగరుగిత్తలనైన నాతడు సులభముగ లోబరచుకొన లేదా?

ఇంద్ర: చిత్తము. దేవరకు పూర్తిగా నిష్టముండిన నా అభ్యంతర మేమియులేదు. ఇక నాకనుజ్ఞ.

అని ఇంద్రగోపుడు చేతుల జోడించి వీడ్కొని చన, చారుగుప్తుడు యేమేమియా యాలోచించు కొనుచుండెను. ధాన్యకటక నగర వర్తకులలో ముఖ్యుడును, వణిక్సంఘాధి పతియునగు చారుగుప్తునకు పందెములన్నచో బ్రాణము. అతని గజాశ్వవృషభశాలలలో, చక్రవర్తిశాలలలో నున్న మృగముల కెంతమాత్రము వెనుదీయని ప్రాణులున్నవి. అతని శకటములు దేవవిమానములు. ఆతని సేవకులు పరాక్రమవంతులగు యక్షపుత్రులే. ధనరాసులు సమకూర్పనెంతయో కష్టపడు చారుగుప్తుడు భోగముల ననుభవించుటలో ఆ ధనరాసుల నశ్రమముగా వెచ్చించును.

హిమబిందు కుమారిని మహారాజు నింటికోడలిని కావింప నెంచియున్నాడు. సౌందర్యఖనియు, ఆనందకందము, తన బహిఃప్రాణము నగు హిమబిందుకుమారి మహారాజ్ఞి కాకపోయినచో తన కుబేరవైభవము గాల్పనా? తనతనయకాక, భరతఖండాన ధాన్యకటక సింహాసనాసీనురాలగుట కింక నేబాల తగును? రాజకుమారిక లుందురుగాక! వారు తెచ్చెడిదేమి, ఇచ్చెడిదేమి! సర్వవిద్యాపరిపూర్ణ సర్వకళాశోభిత, దివ్యసుందరగాత్రయగు తన బాల, హిమబిందుకుమారి. చక్రవర్తులు కని విని యెరుగని మహానిధులతో, అతులవైభవముతో వచ్చుచుండ ఏ సార్వభౌముడు మోకాలొడ్డును! ఈ కార్యసిద్ధికై తాను రెండవ చాణక్యదేవుడు గావలసివచ్చిన వచ్చుగాక.

ఇట్టి యాలోచనలనేకములు చారుగుప్తుని హృదయాకాశాన వెలుగువలె ప్రజ్వరిల్లి పోయినవి. ఆ ఆశయే అతని తపస్సు; ఆతని యైశ్వర్య మాతపస్సాధనము; అతని జీవిత మా తపస్సిద్ధి కంకితమైనది.

చారుగుప్తుడు సన్నగా పొడువున ధనువునకొక గుప్పెడు తక్కువగా నుండును. తప్తకాంచనవర్ణమువాడు. కమ్మెచ్చులు తీసినట్లుండు అంగసంపద గలవాడు. దీర్ఘమై చివర వంగిన గరుడనాసికవాడు. అతివిశాలమగు ఫాలము గలవాడు. గరుడపక్షికి వలె నాసికామూలమున లోతులై ఆతని కన్నులు దీర్ఘములై విశాలములై తీక్షణములై ఎదుటివాని మనసు లోతుల జొఱబాఱుచుండును. పెద్దదగు నాతని బట్టతలపై, అచ్చటచ్చట తెల్లని వెండ్రుకలు లంకలలోని రెల్లుపూవుల జ్ఞప్తిగొల్పుచుండును. మెడలోని ఆణిముత్యముల పేరును, స్వచ్ఛమగు యజ్ఞోపవీతము నాతని బంగారు వన్నెకు మెరుగులు దిద్దినవి. సువర్ణదీప శోణరత్నాలు, సింహళదేశపు గరుడపచ్చలు నాతని కుండలముల మెరుగు లీనుచు కంఠరేఖలలో లీనమగుచుండును.

అడివి బాపిరాజు రచనలు - 2

• 2 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)