యేకవింశద్యుప ప్రయోగములు సుశర్మ సునాయాసముగ గ్రహించెను. ఏ యాయుధపు వ్రేటునైనను ముప్పదిమూడు విధంబుల రక్షించుకొన శక్తికలవాడయ్యెను.
ఆనాడు సుశర్మచక్రవర్తి సుఖాసీనుడైయుండెను. ఆతనితో శివస్వాతియు మరి యిర్వురు క్రొత్తపురుషులును మంతనంబు సల్పుచుండిరి.
సుశర్మ: శివస్వాతీ! పేరువడసిన పోటుమగడవు, నీ వేల నోడిపోతివో?
శివ: చిత్తము. మహారాజాధిరాజుల కేమని విన్నవింతును? ఆంధ్రులు మంత్రవేత్తలు. మాయకాండ్రు. వారు మా పసరములకు పంపిన తృణ తిలపిష్టక లవణ యవ క్షీరసురాఘృత శృంగిభేరాదుల నే మందులు గలిపిరో. నేనతి జాగ్రత్తగనే ముందా దేశపు పసరములకు కొన్నింటికి రుచిచూపుచునే యుంటిని. ఆయినా లాభమేమి? ఆ మందులు నా కోడెలకు జవము తగ్గించినవి. త్వరగా నలసిపోయినవి. ఆంధ్రుల
నొక్కనాటికి నమ్మరాదు.
సుశర్మ: ఆంధ్రులంత మాయకాండ్రా?
శివ: దేవా! ఇంతవరకు మారాజును కన్నుకప్పి సర్వకార్యముల నొనరించు కొనుచున్నారు.
నెమ్మది నెమ్మదిగ గౌతమీనదీకూలములు దాటి కళింగమును జొచ్చుకొని వచ్చుచున్నారు. ప్రభువు నిజవంశ ప్రతిష్ట నేమఱ జనదు. పుష్యమిత్రనృపతి నోడించిన ఖారవేలసార్వభౌముని ప్రతాప మేమయిపోయినదో? అశోకచక్రవర్తి సైన్యములకు చెలియలికట్టయై అనేక సంవత్సరములు లక్షలకొలది వీరుల బలిచేసి ఆ మహాత్ముని స్నేహము గొన్న సుమపాల భూపతి పౌరుష మేమయ్యెనో? నేడు మా చిత్రశిఖ
మహీధవులు తెరపై చిత్రప్రతిమలవలె నాంధ్రు లెటులాడించిన నటులాడు చున్నారు.
క్రొత్త పురుషుడు: మా శివస్వాతి శకటపరీక్షకుం జనినప్పుడు ఆంధ్రరాజ్యపు గుట్టు
మట్టులన్నియు గ్రహించివచ్చినాడు. ప్రమత్తులు, అలసులు నగు ముసలిరాజులు, వారి వంశములు కాలమున లీనమైపోయి నూత్న ప్రభుమంత్రోత్సాహశక్తులు పొడచూపవలెను. ఈ మహాకార్యము సాధింప శివస్వాతి ప్రతిన బూనినాడు. మా ప్రజలందరు జీనపక్షపాతులు. కాళింగులు జైనులు. ఈ జినస్వామిబోధలచే వీర జాతులన్నియు నీరసించుచున్నవి. పురుషకార శూన్యమై చెడుచున్నవి. ఆనంద దాయకమై, పుణ్య ప్రదమై సత్యస్వరూపమగు వేదమతము భారతభూమిలో పునః ప్రతిష్ఠితము కావలెను. ఈ మహాకార్యమును తమరు పైనవేసికొన్నచో మేమందర మనుసరింతుము. మహారాజా! ఆర్యధర్మమును దిక్కుమాలినదాని నొనర్పకుడు.
సుశర్మ: రాజకుమారా! నిజము చెప్పుము. తా మింతవరకు నెవ్వరి చేత నోడింప బడలేదని
ఆంధ్రులకు గర్వము. వారికున్న సైన్యములు, ప్రతాపములు జంబూద్వీపమున నేరికిని లేవని అంద రనుచున్నారు. అట్టివారు కళింగ మాక్రమించుకొన్నచో మాళవ విదేహగ్రమ నేపాళ కాశ్మీర పాంచాలాది దేశముల జయించినచో ఆశ్చర్యమున్నదా?
వారిఢాక కెదిరి నిల్చువా రెవరు?
శివస్వాతి: ప్రభూత్తమా! దేవర వచించినది నిజము. మనమందర మాడువారమై యూరకున్నచో నట్లేయగును. ఈ యువకుడు కళింగాధిపతికి మేనల్లుడు. మాసహోదరి నీతని కిచ్చిరి. రెండవయాతడు విదేహాధిపుని తమ్ముని కుమారుడు. ఔఘల నామధేయుడు. ఇదివరకే నావేగువలన దేవర కంతయు విశదమై యుండగలదు. కళింగమున నా అధికారమున రెండక్షౌహిణుల సైన్యములున్నవి. ఇంక ననేకదళముల
అడివి బాపిరాజు రచనలు - 2
• 96 •
హిమబిందు (చారిత్రాత్మక నవల)