పుట:Himabindu by Adivi Bapiraju.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తక్కువయుండు నాతని నా కాలపువారిలో పొట్టివాడనియే చెప్పికొనువారు. చంద్రగుప్త మౌర్యసార్వభౌముని, అశోకచక్రవర్తిని తలంచుకొనియు, వైదికమార్గనిష్ఠులగు నాదిభూపతుల వైభవము భావించుకొనియు భారతదేశమంతటి నొక్కయేలుబడికి గొనిరావలెనని సుశర్మ ఉఱ్ఱూతలూగుచుండెను. ఆతని భావమున జంబూద్వీపమంతయు దన క్రీడాస్థలమై గోచరించినది. ఆతని రథచక్రధ్వానములు హిమవన్నగముల దాకి వెనుకకు ప్రతి ధ్వనుల నంప నవి వింధ్యగిరికందరముల బలుకరించి పోయి పోయి నీలగిరి సానువులతో జెలికార మొనర్చినవి.

ఆ సుశర్మప్రభువు సర్వకాలముల దేవజాతత్పరుడై వేలుపులకు మ్రొక్కుకొను చుండును. ప్రాణుల బలి యొసంగుచుండును. బౌద్ధమతము నశించి బ్రాహ్మణమతము వ్యాపించవలె నను ఆశయు, ఒక్క చక్రవర్తి, ఏక పరిపాలన, ఒక్క న్యాయము, ఒక్కమార్గము అను దృఢాభిలాషయు ఆతని ఎముకయెముకకును పట్టి పోయెను. బ్రాహ్మణుడు ఏమి చేయకలుగును? సైన్యాధిపతియై తన అక్షౌహిణులను విజయాశ్వముల నడుపుటకు శక్తి లేదు. నలుగురిని గూడకట్టికొని వచ్చుటకు దగిన వ్వక్తిత్వము చాలదు. మహామేధావి, ప్రతిజ్ఞానిర్వాకుడు, యశోవిశాలు డగు చాణక్యునంత వాడు కాడు. కాని సుశర్మకు బుద్ధిబలము లేకపోలేదు. బాహుబలద్వితీయమైన బుద్ధిబలము ప్రకాశించును. చాణక్యునికి చంద్రగుప్తుడు కావలయుగదా!

సామ దాన భేదోపాయముల సర్వకార్యంబుల నీడేర్చుకొన సుశర్మ సంకల్పించు కొనెను. పాటలీపుత్రంబున బౌద్ధ భిక్షువుల సంఘారామంబులకు బ్రతిగా బ్రాహ్మణ పరిషత్తుల ప్రారంభించినాడు. అవ్వాని కన్నింటికి నగ్రహారము లొసంగెను. పండితులు, శాంతస్వభావులగు భూసురుల కనేకుల కాశ్రయమిచ్చి వారిచే భారత రామాయణాది గ్రంథములలో బౌద్ధమతఖండనల ప్రక్షేపింపజేసి, అనేక ప్రతుల సృజించి దేశమున వెదజల్ల నారంభించెను. షట్చక్రవర్తుల చరిత్రలను సమకూర్పించిన దీతడే. అంతకు మున్ను అచ్చటచ్చట నలుడు, హరిశ్చంద్రుడు, సగరుడు మొదలగువారల కథలు, చరిత్రలు చెప్పుకొనువారు. నేడు వారి కథలు పురాణేతిహాసముల నందగించినవి.

బౌద్ధమత ప్రతిపక్షులగు బ్రాహ్మణులనేకులు తలలెత్తిరి. ప్రతి దేశమునకు వారు ప్రచ్ఛన్నులై చని అచ్చట వైదికధర్మాభినిష్టుల నెలకొల్పి వారిసహాయమున ప్రజలకు వేదమతమును క్రొత్త కొత్త వ్యాఖ్యానములచే నుపదేశింపసాగిరి. బౌద్ధుల పై కత్తిగట్టించు చుండిరి. సుశర్మ మహారాజిదియంతయుజూచి సంతోషించుచు హాసపూర్ణవదనుడగు చుండును.

మౌర్యుల కాలమునుండియు భారతసార్వభౌమత్వమునకు పాటలీపుత్రమే నెలవైనది. పాటలీపుత్రసింహాసనాసీను డగువాడే చక్రవర్తి అను భావము రూఢమైనది. బలవంతులగు రాజుల నందరి నోడించి సామంతుల చేసికొని, ఒడ్డోలగంబున నుపవిష్టుడనై జయజయ ధ్వానములు సెలగ నింద్రవైభవమనుభవించు టెప్పుడు సమకూరునా యను గాఢతృష్ణ సుశర్మను వెఱ్ఱివానిని చేసినదాయెను.

పరశురాముని తలపోసికొని, ఆ మహావీరుని విగ్రహముకడ సుశర్మ ఏకలవ్యునివలె తపమొనర్చును. అత్యంతపురాతనమై, బంగారుపిడియు, వజ్రశిరోభూషణమును గలిగి, సుందరమై, వేదఘనపాఠమువలె విపులముఖమగు మహాపరశువును సుశర్మ నేపాళము నుండి సముపార్జించెను. త్రిచక్రమార్గములు అష్టాదశవక్రములు, నవవిధ ప్రహారములు,

అడివి బాపిరాజు రచనలు - 2

• 95 •

హిమబిందు (చారిత్రాత్మక నవల)