పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

81

సేవకుల వచనములు విని మన కార్యసాఫల్యామీ దినమునవైనది. ఇంక నుత్తరములతో బ్రయోజనము లేదు. ఱేపుచిత్తూరుసంగతులనువిని యతఁడే మనకడకువచ్చును. మనమాతనిదగ్గఱ కఱుగక్కఱలేదు. బండికి గుఱ్ఱములఁబన్నుఁడుఁ” అని యాజ్ఞాపించెను. నిశాసంచారమెన్నఁడెరుఁగని యాబాలుఁడు బ్రాహ్మణుని విపరీతచేష్టలను రహస్యాలోచనములను జూచి సందేహింపనారంభించి నాయర్ధరాత్రమున నానిర్జనప్రదేశమున నాగాఢాందకారమునం దాబ్రాహ్మణుఁడు సహచరసమేతుఁడై యుండుటచే తన కెట్టి యపాయమునైనఁ జేయఁగలఁడని భయపడసాగెను. ఒక విదేశీయునిమాటలు నమ్మి యంతఃపురములబాసి తానట్టికాలమున మారుమూలకు వచ్చినందులకు నతఁడు చింతింప జొచ్చెను కాని బాలుఁడైనను ధైర్యసంపన్నుడగుటచే మనస్థయిర్యమును విడువక కాఁదలఁచిన కార్యము కెదురు చూచుచుండెను. అంతట బ్రాహ్మణుడు బాలకుని సమీపించి “స్వామీ! వారుతోటలోనికివచ్చినారు. మేము వారలఁ బట్టుకొనియెదము. దురాత్ముల వలన నపాయము గలుగకుండ మీరీబండిలో గూర్చుండుడు.” అని తచ్చకటమునుజూప భయ సందేహములు ద్విగుణములై మనస్సుగలంప బాలకుఁడా శకటమధిరోహించెను. బ్రాహ్మణుడు పిమ్మట నానందదాసు శంకరుని దూరముగాఁ బిలిచి బండివడిగాఁదోలుఁడు. ఆరేసిక్రోసులకొకచోట నంచెబండ్లు కలవు గనుక మన మతివేగముగా బోగలము. ఈతడు పెంకెతన మధికముగా జేసినప్పుడు తుపాకులతో బేల్చివేయవచ్చును గానిముందుగా నట్టిపనిజేయక సాధ్యమైనంతవరకు బ్రాణములతో నీతనిఢిల్లీకిఁదీసికొనిపోవుఁడు” యని యాదురాత్ముల కుత్సాహమొసంగి తానును శకటములో నెక్కెను. ఆసమయమునఁ దనయేలిక యవస్థఁ యపాయముగ నుంటజూచి గాంభీర్యమునువిడచి తొట్రుపాటుతోఁ