పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

హేమలత

జిదానందయోగి మదనసింగును జూచి బాబా! కత్తి. కత్తి. నవమన్మధసమానుడగు నాబాలుడు మనస్వామియు రసపుత్రకులతిలకమునగు శ్రీకుమారలక్ష్మణసింగు మహారాజుగారు దుర్మార్గుడగు నాబ్రాహ్మణు డాతని నపాయ సముద్రమున ముంపదలచినాడు. కనుకజాగ్రత్తగనుండుము. అని రహస్యముగ జెప్పెను. అర్ధరాత్రమున దనయేలిక నిజాంతఃపురముల బాసి పయోముఖవిషకుంభమునుబోలు నొకదురాత్ముని విశ్వసించి వచ్చినందుల కాత్మగతమున మెచ్చికొనుచు నతని కపాయమగునేమో యన ముందుకు దుముక జూచుచు, దైవమును దూరుచు మదనసింగు పరిపరి విధముల విచారింపనారంభించెను. చిదానందయోగి మాత్రము బండిపై దృష్టినిలిపి రెప్పవాల్చక చూచుచుండెను. తనతోగూడ బ్రాహ్మణుడును శకటమారోహించినందున బాలుడు వానిజూచి నిశ్శంకముగ నిట్లనియె. నన్నీతోటకు దెచ్చుటలో నీ యభిప్రాయమేమి? నీవేమైనను ద్రోహము చేయదలంచినావా? యని యడుగగానే బాలునికంఠముపై జేయివైచి నొక్కిపట్టి నిన్ను నేను ఖైదీగ ఢిల్లీ నగరమునకుఁ గొనిపోవుచున్నాను. అల్లాయుద్దీను నిన్నుఁ దెమ్మని మాకు నాజ్ఞయిచ్చినాడు. నేడునీవునాచేతజిక్కినావు. నీవింక నేమి చేయగలవు? రాజపుత్రుడవగుదునేని ధైర్యము జూపి తప్పించుకొమ్ము. పారిపోవ యత్నించినా నాచేత జచ్చితివని నమ్ముము, అని క్రూరుడగు వసంతభట్టు రెండవచేయి తనవాడికత్తి వంక బరపెను. ఆయాపదజూచి వెరవక రాకొమరుడు తన మొలనున్న ఖడ్గము నూడబెఱికి హస్తమున ధరించునంతలో మదనసింగు స్వామిప్రాణరక్షణమున కరుదెంచి నిలునిలు దురాత్మా, యని తోఁట ప్రతిధ్వను లెసగ నఱచి బండిమీఁదకుఱికి మూయబడియున్న బండి తలుపును ఫడాలునదన్ని విరుగగొట్టి లోన బ్రవేశించెను. వసంతభట్టు