పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

హేమలత

తరువాత యోగానంద మఠము దగ్గర నన్ను గలసికొనుము. జయ్ క్షీరసాకారశయిన యని నీవు పలికిన వెంటనే నేను నిన్నానవాలు పట్టెదను. నేను మరొకనితో మాటలాడు చుండిన యెడ నీవు నాకడకు రావద్దు. ఈ రాత్రి నీ రాజ్యమును నీదేశమును నీవు కాపాడుకొందు వని యోగి చెప్పి వెడలిపోయెను. అతని సాగనంపి రెండునిమిషములు మదనసింగు వాని మాటల సారాంశమేమై యుండునా యని యోజించెను. కాని తెలియరాలేదు. అతడు లోనికిం జని ప్రతాపసింగును జూచి యోగికిని దనకును జరిగిన సంభాషణమును సవిస్తరముగ దెలియజేయ నాతడు విస్మయమునొంది కుమారునితో నాయనా! నీవాలస్యమును జేయక త్వరగ నరుగుము. యోగి మాటలయం దర్థము విస్తారముగ నున్నదని నేనూహించెదను. అతడు మనరాజ్యముపై మిగుల భక్తి గలవాడగుటచే గారణాంతరమున యోగిగానున్నట్టుల గనబడునుగాని నిజముగా యోగికాడని నాయభిప్రాయము. త్వరగా నీవు బ్రాహ్మణ వేషమువైచికొనుము. అని యాతనికుత్సాహజనకములగు మాటల జెప్పెను. మదనసింగును తక్షణమే లోనికిబోయి తన రాజచిహ్నముల నెల్ల దీసివైచి మొగమునిండ బూదిబులిమికొని చిన్న యంగవస్త్రమును గట్టికొని చేతితో నొక చెంబును భుజముపై నొక దుర్భాసనమును సంతరించి తండ్రియెదుటికి వచ్చి నమస్కరించెను. అంతట బ్రతాపసింగును కుమారుని జూచి, నాయనా! నిజముగ బ్రాహ్మణుని వలె నున్నావు. అని లోపలకత్తి యమర్పబడిన చేతికఱ్ఱ నతనికిచ్చెను. అదిగైకొని మదనసింగు పోవుచుండగా నర్థ రాత్రమునందు దుర్జన సంచారములగువీధులకొంటరిగ దనకుమారు డరుగుట కిష్టములేక ప్రతాపసింగు తత్సహాయముగ నిద్రించుచున్న కృష్ణసింగును లేపి నిద్రమత్తునకు