పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

73

గంజాయిమత్తు తోడుగ దూగుచున్న వానికి వెంటనంపను. అపుడు వారిరువురును గృహము విడిచిపోవునపుడు ప్రతాపసింగు, “నాయనా! కడు జాగ్రత. శత్రువులనేకులుందురు. నీకపాయమేదైన నుండునేని గృష్ణసింగును నావద్దకు బంపిన నేను వెంటనే తగుబలముతో నీసహాయార్థము వచ్చెదను. అని చెప్పి వారల నంపెను. వారరిగిన వెనుక బ్రతాపసింగు తన శరీరమింటమన్నను మనస్సు కుమారుని మీదికే పోగా నానాటి సంగతులనెల్ల మదిలో నూహించుకొనుచు జిత్తూరు రాజ్యక్షేమమును గూర్చి భయపడుచు బురమున గుట్రలు జరుగుచున్నవని విచారించుచు “ఓ భగవంతుడా, అతిపురాతనమైన చిత్తూరు రాజ్యమున కాపదరాకుండ జేయుము. ఆవశ్యకమైనచో నా ప్రాణములనైన నిచ్చెదను. నాకుఱ్ఱవానిని సుఖముగ నింటికి దెమ్ము” అని ప్రార్థించుచు నిద్రరాక పలుమారులు వీధితలుపులు దెఱచి చూచుచు, నా రాత్రి కలవరపడుచుండెను. అట్లు మదనసింగును గృష్ణసింగును బయలుదేఱి పదినిమిషములలో రాజవీధికి జనిరి. గంజాయిమత్తు పూర్ణముగ గృష్ణసింగును విడువనందున నడచుచునే యతడు కునుకుపాట్లు పడుచు యజమానుడు వచ్చి వీపు మీద దట్టగా మేలుకొని వడివడి బరుగెత్తుచు నతని వెంట వచ్చుచుండెను. వారు రాజవీధి మధ్యమునకు వచ్చునప్పటికి జామున్నర రాత్రియయ్యెను. అది వెన్నెల గల దినముగానందున నంధకారము నగరమునంత నావరించెను గాని గగనమండలము నందు వజ్రములవలె దళతళ మెఱయుచున్న నక్షత్ర కోట్లు కొంచెము వెలుతురు విచ్చుచుండెను. పట్టణమెల్ల మాటుమడుగుటచే మనుష్య సంచార మంతగా లేకపోయినను జలువ వస్త్రములు గట్టుకొని యత్తరు మొదలగు సుగంధ ద్రవ్యంబులును గ్రమ్మ పూదావులను దమ