పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

61

చక్రవర్తి దర్శనముచేసి యుచితసత్కారమునొంది వేడుకొనఁగా జక్రవర్తి దండయాత్రతోఁ దనసైన్యముతో గూడ నాజరుజంగు వచ్చుటకు మాత్రము సెలవొసంగెను. అంతటితో దృప్తినొంది నాజరుజంగు దండ్రియు నింటికింజనిరి. మఱునాఁడు సూర్యోదయకాలమున ఢిల్లీనగరమునందు వసంతభట్టు చెఱలోనుండి పాఱిపోయెనని యొకవాడుక పడెను. అట్టిమహాద్భుత మిదివఱకు నెన్నఁడుఁ గనివిని యెఱుఁగమని జనులు పరిపరివిధములఁ జెప్పుకొనసాగిరి. కారాగృహాధికారి భయముచే వడకుచువచ్చి పాదుషా పాదముపైబడి యేడ్చుచు నావార్తదెలిపి క్షమియింప వేడుకొనెను. చక్రవర్తియు నాశ్చర్యమునొంది యాతనికభయమిచ్చి వసంతభట్టును బట్టి తెచ్చినవారికి నూఱువఱహాలు బహుమానముగ నిచ్చెదమని పట్టణమున జాటియించి యతనిని వెదకుటకై యనేకులను బంపెను.

అక్కడనట్లు నారాయణసింగు చెఱలో నుంచబడిన రాత్రి వర్ణింపనలవిగాని మహాదుఃఖము నంది తెల్లవారిన తరువాత నిద్రలేక తనకు సంభవించిన మహాపదకంటె మనుమరాలి సంగతి యేమయ్యెనా యని యొక్కవ సంతాపము నొందనారంభించెను. మఱునాడుదయమున హేమలత యెచ్చటగనబడ లేదని తెలిసినప్పు డామె మృతినొందియుండునని నిశ్చయించుకొని యతడు కంటికి నేలకు నేకధారగా నేడ్చుచు నడుమ నడుమ మూర్ఛిల్లి యామూర్ఛలో హేమలతా! మందులసంచి తెమ్మని కలువరించుచు గలతనిద్రగలిగినప్పుడు మనుమరాలిపై దుస్స్వప్నముల గనుచు లేచి విలపించుచు, మెలకువగనుండు నప్పుడు అమ్మా! హేమలతా! చిన్నతనము నుండియు దల్లిదండ్రులులేని పసి