పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిల్లను నిన్నుబెంచి నేడు నేలపాలు చేసినాను. అమ్మా! నీవేనూతిలో బడిచచ్చినావు నాకడుపుమీదదలపెట్టు కొని నీవిక నెన్నడును నిద్రపోవుగదా! కథలను జెప్పమని నన్నికరాత్రి బలవంత పెట్టువారెవరు? అయ్యయ్యో! ఆనాటి రాత్రియే మనకు గడసారి కాబోలును అని పరిపరివిధముల హేమలత చేసిన చేష్టలను నామె ముద్దుమాటలను దియ్యనిపాటలను దలచితలచి విలపించుచుండెను. ఆమఱునాటి మధ్యాహ్న మతనికి గోవిందశాస్త్రి భోజనమును దెచ్చిపెట్టెను. ఈ ప్రకారమొక వారము గతించునప్పటికి ఖాను ఢిల్లీకి బోవలసి వచ్చెను. ఖానుస్థానమునం దంతకంటె గర్కోటకుండొకడు నియమింపబడెను. అతడు ఖానుచేతిక్రింద నున్న చిన్న యుద్యోగస్థు డేయైనను నధికారి యైనతోడనే గర్వముగలవాడై జనసామాన్యముతో మాటలాడుట తన గౌరవమునకు దగదనియు దనతో సమానులు లేరనియు దురభిప్రాయమునొంది తనకంటె వెనుకటి ఖానే గుణవంతుం డని జనులనుకొనునట్లు వర్తించుచుండెను. అతడాయుద్యోగమునకు వచ్చిన నాల్గుదినములకు జెఱసాల పరీక్షచేసి నారాయణసింగును మౌలవినిజూచి నారాయణసింగు బ్రాహ్మణులు తెచ్చి యిచ్చిన భోజనమును దినకూడదు. ఇచ్చట మహమ్మదీయులు వండిన యన్నముదినవలయు నని యాజ్ఞనొసంగెను. ఈయుత్తరవు వలన మహమ్మదీయుడగు తనకు బాధలేకపోయినను పరమత సహనము గలవా డగుటచే మౌలవి నారాయణసింగు స్థితికి మిగుల దుఃఖింప నారంభించెను. మఱునాడు మధ్యాహ్నము తురక లిద్దఱన్నము వండి చిప్పలోవైచితెచ్చి నారాయణ సింగును భుజింపుమనిరిగాని యాతడు తినక నుపవాసములు చేయుచుండగా నతనికి బ్రాణాపాయము వచ్చినయెడల జక్రవర్తిచే దనకు మాటవచ్చునని భయపడి