పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

59

మాకతడుచేసిన ప్రత్యుపకారమిది” యని యెలుగెత్తి చక్రవర్తి పలుక నాజరుజంగు గుండెలు ఝల్లు మనియెను. రహిమానుఖాను ముఖము మందహాసముతో గూడుకొనియుండెను. మహమ్మదీయ సామంతుల హృదయము లాశ్చర్యముతోను విచారముతోను నిండినవి. పిడుగువలె దనపైబడిన యపనింద భరింపలేక నాజరుజంగు ధైర్యము దెచ్చుకొని చక్రవర్తి కభిముఖుడై “మహాప్రభూ! నాచేసిన యపరాధ మేదియు నేనెఱిగినంతవఱకు లేదు. నాయపరాధము నాకెఱిఁగించి యది యిందు ఋజువుచేసి యీమహాజన మధ్యమున నన్ను శిక్షించుట యుచితముగాని నిష్కారణముగ శూలముల వంటి మాటలతో నన్ను బాధపెట్టతగదు. నేను నారాజునకు నాదేశమునకును వ్యతిరేకముగ నెన్నఁడు బ్రవర్తింపలేదు” సభ్యులకెల్ల జాలిజనియింప బలికిన నాజరుజంగు వచనంబులు చక్రవర్తి లక్ష్యపెట్టక మహాకోపమున “నీవింక మాటలాడవలదు. నీవు చేసిన యపరాధమునకు నీయుద్యోగము నూడఁదీసినారము. నీవు సేనకధిపతిగ నుండదగవు. నీతండ్రి తాతలయందలి గౌరవమునుబట్టి నిన్ను మేమింతటితో విడిచినాము పొమ్ము” అని తక్షణము సభనుండి సాగఁదోలెను. నాజరుజంగు పరువుగల యుత్తరహిందూస్థాన మహమ్మదీయ కుటుంబము లోనివాడు. అతని తండ్రి బానిసవంశము నాటనుండియుఁ జక్రవర్తుల కొలువుననుండి యావంశనాశనానంతరమున జలాలుద్దీనువద్ద సేనానాయకుడుగ నుండెను. ఈ కాలమున వృద్ధుఁడై పనిజేయజాలక తన కుమారుని రాజసేనయందు నియోగించి తానింటివద్ద సుఖముగఁ గాలక్షేపముఁ జేయుచుండెను. చక్రవర్తి నాజరుజంగుపై నీవఱకును నమ్మకము దయయు నుండెనుగాని రహిమానుఖానుని దుర్భోధవలన నిప్పు డలుక పుట్టెను.