పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

హేమలత

మిత్రులకు నుత్తరములు వ్రాసియిచ్చి సాధ్యమైనంత త్వరగఁ బ్రయాణమై పోవలసినదని చెప్పి వారితోఁ బోవుట కిర్వురు సేవకుల నేర్పఱచెను. ఆమధ్య హేమలతకు జ్వరమువచ్చుటచేఁ బ్రయాణ మాగిపోయెను. మౌలవియు నారాయణసింగుతో స్నేహముచేయుట తనకు నిష్టముగ నున్నందున ఖాను వానితో స్నేహము చాలింపవలసినదని యాయనకు వర్తమానమంపెను. మౌలవి దానిని లక్ష్యపెట్టనందున, గోపమతిశయింప వారి గర్వభంజన మొనర్చుటకుఁ గృతనిశ్చయుఁడై సమయమున కెదురుచూచుచు సాహేబు దినములఁ గడపుచుండెను. ఈ నడుమ హేమలత జ్వరమువలన మిగుల బాధనొందుచున్నందునను, నదియేయౌషధము చేతగు లొంగకున్నందునను వృద్ధుఁడు కొందఱి యోచన మీదఁనా గ్రామమునకు వచ్చియున్న గోసాయినిఁ బిలిపించి యాతనితోఁ దన మనుమరాలి వృత్తాంతముఁజెప్పెను. గోసాయిని జూచి హేమలత నమస్కరించి యెదుట నిలువ నతఁడామె నాశీర్వదించి యామె మొగమువంకఁ దేఱిపాఱజూచి ముసలివానిశరీరము నామూలాగ్రముగఁ బరీక్షించి మిగులనానందమునొంది తనయానంద సూచకముగఁ గొన్ని మాటల వచ్చుటకు యత్నించియు, బలవంతముగ దనసంతోషము నాపికొని ఆహా మీరిరువురునును జీవించియున్నారా? ఎన్ని దినములకు మీరగపడినారు. భగవదనుగ్రము మన పైఁ బూర్ణముగఁగలదు అని తనలో ననుకొని హేమలత నాడి పరీక్షించి కొంచెము దృష్టిదోషము తగిలినదని రక్షరేకు నొకదానినిచ్చి కంఠమునఁ గట్టుకొమ్మని చెప్పి యామె చేయి ముద్దువెట్టుకొని తరువాత వృద్ధునియొద్దకుఁబోయి యనేక వ్యవహారముల ముచ్చటించుచు నడుమ నిట్లనియె. “అయ్యా! తమసంగతి నంతను నేనెఱుఁగుదును. మీరు బ్రతికి యున్నారని నేనిదివఱ కెఱుగను. నేడు సుదినము అని గోసాయి పలుకగా