పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ ప్రకరణము

మదనసింగునకు గాయము తగిలిన మఱునాడు రహిమానుఖాను తన యంతఃపురమున నొకగదిలో దీర్ఘవిచారమున బాధపడుచు గూర్చుండెను. అపుడు నాతనియెదుట కిర్వురు సేవకులు వచ్చి భయవినయములతో వంగి వంగి సలాములుచేసి కట్టెదుటనిలువంబడిరి. అది సంధ్యాసమయముగనుక కార్యాంతర మాలోచించుచున్న ఖాను వారిని గుర్తింపక “ఎవరువారు?” అని బిగ్గఱగ నఱచి చూచి “ఓహో! నందుడా! రెండవవాఁడెవడు? ఓరీ గులామల్లీ! మీరు సుఖముగా వచ్చినారా? యని పలుకరించెను. అంతట నా సేవకద్వయము. “ఏలినవారి కటాక్షమువలన మేమీ గడియవఱకు సుఖముగా నున్నాముస్వామీ” యని కంటనీరువెట్టుకొనఁ జొచ్చిరి. ఖానుసాహే బదరిపడి జరిగిన యావద్వృత్తాంత మెఱిఁగింపుమన వారిలోనందు డిట్లని చెప్పసాగెను. మహాప్రభూ! ముందుగ నిన్నటి వృత్తాంత మెఱిఁగించెదను. నిన్న నుదయ మెవరో పదుగురు మనుష్యు లాగ్రానగరమునుండి యెటకో బోవుచు మాకగపడిరి. భాగ్యవంతులగు బాటసారుల విడువవలదని యేలిన వారిచ్చిన హుకుము ప్రకారము వారు ద్రవ్యవంతులవలె నుంటచే మే మిరువది యైదుగురము వారిపైఁబడితిమి. తరువాత నేమి మనవి చేయుదును మహాప్రభూ! అందొక సుందరఁడగు రాజపుత్రుఁడు మాపైఁబడి మాలోఁ దక్షణమే పండ్రెలడుగురను స్వర్గమున కంపెను. మిగిలిన వారాఱ్వురు గాయములఁ జెంది మరణమునకు సిద్ధముగ నున్నారు. కాని యారాజపుత్రునకు గాయము దిట్టముగ దగిలినది స్వామి” యని కన్నీరు కాల్వాలుగట్ట నేడ్చుచు గద్గద స్వరముతో మనబాలాజికూడ మృతినొందెను మహాప్రభూ!