పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

125

నున్న సుందరాంగికి బ్రత్యుత్తరమీయజాలక మరల నొకపర్యాయము నీ విషయమై ప్రయత్నించెదనని చంద్రసేనుడు కన్నీళ్ళతో వెడలిపోయెను. హేమలత ప్రతిక్షణమును తనకొఱకు బల్లకివచ్చుననియెంచుచు మృత్యుదేవత రాక కెదురుచూచుచుండెను.

ఆ దిన ముదయమైనది మొదలు రహిమానుఖాను మదనసింగును దుదముట్టించు మహోత్సవముగలుగునని మహానందముతో నుండెను. హేమలత తన సంయోగమునకు సమ్మతింపనందున నామెపై గసిదీర్చుకొన దలంచి చక్రవర్తి కామెనెరింగించెను. ఆ కారణముచే నతడు రెండు రెట్లు సంతోషముగ నుండెననుటకు సందేహము లేదు. జాము ప్రొద్దెక్కిన తరువాత మదనసింగును బూర్వోక్త ప్రకారముగ వధింప వలదని చక్రవర్తి యొద్దనుండి ఖాన్ న కుత్తరవు వచ్చెను. వెంటనే ఖాను మిగుల నెఱ్ఱగ గాలిన యినుపకర్రులను బట్టించుకొని యిరువురు సేవకులతో మదనసింగు వసియించు గుడారమునకు బోయి మదనసింగును జూచి మరణమునకు సిద్ధముగ నుండుమని చెప్ప ఖాన్ తో నతడు దనకు మృత్యువు తృణపాయ మనియు దాను సిద్ధముగ నుండెననియు ధైర్యగాంభీర్యముల బలికెను. అంతటఖాన్ కోపమున బండ్లు పటపట గొఱకుచు నినుపకర్రలను మదనసింగు కన్నుల పై బెట్టి కాల్పుడని సేవకుల కానతిచ్చెను. సేవకులును నరహత్యయం దారి తేరిన వారగుటచే యజమానుల యాజ్ఞ తక్షణమే శిరసావహించి కాలిన యినుప కర్రుల నెత్తి పట్టుకొని మదనసింగు సమీపమున కరిగిరి. వెంటనే నందుడు సింగును వెనుకకు బడద్రోయ తక్షణమే యిరువురు సేవకులు మదనసింగు రెండుచేతుల