పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియేడవ ప్రకరణము

హా! దైవమా! నన్నింత దిక్కుమాలినదానిగ నేలజేసితివి? ఆ పవిత్రమగునట్టియు గౌరవమగునట్టియు రాజపుత్రవంశమునబుట్టి తుదకు నిర్భాగ్యురాలయి శివప్రసాదుపంచను గొన్ని నాళ్ళును, జంద్రసేనుని యింట గొన్ని నాళ్ళును వసియించి మహమ్మదీయుల బారిబడుచున్నాను. నాకేల మరణములుగలుగజేయవు? హా తాతా! ఎందున్నావు? అయ్యోతల్లీ నా బాల్యముననందె నీవు మృతినొందుటచేతగది నాకిట్టి యవస్థసంభవించినది, కడుపులో నున్న దుఃఖము నెల్ల దెలుపుకొందమన్న నిరుపార్శ్వముల బంధువులైన లేదు. నేనేమి చేయుదును? మరణమేనాకు శరణ మగుగాక! బలవంతముగా జక్రవర్తిచే నవమానింప బడుటకంటె మర్యాదగ మృతినొందుట మేలుగదా. అని తనలో దాననుకొనుచున్న హేమలత వద్దకు జంద్రసేనుడువచ్చి యామె గౌరవమును గాపాడలేనందులకు విచారించుచు అమ్మా! యీ దినమున నిన్నుదప్పక తీసికొనిరావలసినదని చక్రవర్తి మరల నాకు వర్తమానమునంపినాడు. ఈమాట నీతో జెప్పజాలక నేను సందేహించుచున్నాను. ఏమిచేయుటకును దోచదు. అయినను నా ప్రాణముల నిమిత్తము పోగొట్టు కొందును. నా మరణాంతముగాని నీకు బరాభవము సంభవింపదు. భయపడకుము” అని పలుక హేమలత యామాటలు విని ‘నా నిమిత్తము మీరు మృతినొందవలదు. నాకవమానము ఘటిల్లెడు పక్షమున నాచేతినున్న వజ్రమును నూఱుకొని త్రాగుటకు సిద్ధముగనున్నాను. నా వజ్రపుటుంగరమ నా యవమానమును బాపనోపును. ఆ చెఱలో నీవఱకు మృతినొందియున్న మాతాతను సత్వరమే నేను కలిసికొందును.’ అని యాత్మహత్యకు సిద్ధముగ