పుట:Hello Doctor Final Book.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(మొదటి తరగతి మధుమేహ వ్యాధి (Type 1- Diabetes), రుమటాయిడ్ కీళ్ళనొప్పులు (Rheumatoid arthritis) వంటివి ఉన్నవారిలో సమగళ గండము (Diffuse goiter), గళగండ స్రావకఆధిక్యత ఎక్కువగా పొడ చూపుతాయి.

గ్రేవ్స్ సమగళగండ స్రావకఉద్రేకత (Grave’s disease) కలిగిన వారిలో గళగండస్రావక ఆధిక్యతతో (Hyperthyroidism) బాటు వెలిగుడ్లు (Exophthalmos), నేత్ర వైకల్యము (opthalmopathy), జంఘికాస్థుల ముందు ఉబ్బుదలలు (pretibial myxedema) కూడా కలుగుతాయి. పరీక్షలు :

గళగ్రంథి ఆధిక్యత ఉన్నవారిలో గళగ్రంథి ప్రేరేపకపు (TSH) విలువలు రక్తములో తక్కువగా ఉంటాయి. గళగ్రంథి స్రావకముల విలువలు (T-4, T-3) ఎక్కువగా ఉంటాయి. Grave’s disease ఉన్నవారిలో గళగ్రంథి ప్రేరేపక గ్రాహకములకు ప్రతిరక్షకములను (Antibodies to TSH receptors) రక్తపరీక్షలతో కనుగొనవచ్చును. రేడియోధార్మిక అయొడిన్ I-131 లేక, I -123 నియమిత మోతాదులో యిచ్చి గళగ్రంథిలో వాటి గ్రహణము (Uptake) కొలిచి గళగ్రంథి చైతన్యమును నిర్ధారించ వచ్చును. గామా ఛాయా గ్రాహకములతో గళగ్రంథి చిత్రములను తీసుకొని గళగ్రంథిలో చైతన్యకేంద్రములను పసిగట్టవచ్చును. గళగ్రంథి ఆధిక్యత కలిగిన వారిలో రక్తములో చక్కెర విలువలు అధికమవవచ్చును. వీరిలో కొలెష్టరాలు విలువలు తక్కువగా ఉండవచ్చును. చికిత్స :

గళగ్రంథి స్రావక ప్రభావము వలన వచ్చే లక్షణములను అదుపులో పెట్టుటకు, నిర్దిష్ట చికిత్స జరిగే వఱకు తాత్కాలిక ఉపశమనము కొఱకు బీటా ఎడ్రినెర్జిక్  గ్రాహక అవరోధకములను (ప్రొప్రనలాల్, మెటాప్రొలోల్, లేక, ఎటినలాల్) వాడుతారు. ఇవి సహవేదన నాడీమండల ఉధృతి వలన వచ్చే గుండెదడ, ఆందోళన, హస్తకంపనములు, రక్తపుపోటు వంటి ఫలితములను అదుపులో ఉంచుటకు తోడ్పడుతాయి.

71 ::