పుట:Hello Doctor Final Book.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5. గళగ్రంథిహీనత

(Hypothyroidism)

నిత్యజీవన ప్రక్రియకు గళగ్రంథి స్రావకములు (Thyroid hormones) ఎంతగానో అవసరము. ఈ కంఠగ్రంథి (Thyroid gland) కంఠము ముందర స్వరపేటిక, శ్వాసనాళములను ఆనుకొని సీతాకోకచిలుక ఆకారములో ఉంటుంది. ఈ గ్రంథికి కర్ణికలు (Lobes) రెండుప్రక్కలా ఉండి ఆ రెండు కర్ణికలను కలుపుతూ నడిమిన సంధానము (Isthmus) ఉంటుంది. వయోజనులలో యీ గళగ్రంథి కర్ణిక పరిమాణము 5 సె.మీ ఎత్తు, 3 సె.మీ వెడల్పు 2 సె.మీ మందము గలిగి ఉంటుంది. గళగ్రంథి స్రావకములు థైరాక్సిన్ (Thyroxin T-4), ట్రై అయిడో థైరొనిన్ (Triiodothyronine, T-3), కణజాలముల జీవవ్యాపారక్రియకు (Body metabolism) దోహదకారిగా ఉంటాయి. శిశువుల వృద్ధికి, మనోవికాసమునకు కూడా థైరాక్సిన్ తోడ్పడుతుంది. జంతుజాలములో విశ్రాంత జీవవ్యాపార ప్రమాణము (Basal metabolic rate) గళగ్రంథి స్రావకములపై ఆధారపడి ఉంటుంది.

గళగ్రంథినుంచి అధికముగా థైరాక్సిన్, T4 (సుమారు 80 శాతము) ఉత్పత్తి జరుగుతుంది. ట్రై అయిడో థైరొనిన్, T3 సుమారు 20 శాతము ఉత్పత్తి జరుగుతుంది. కణజాలములో ట్రైఅయిడోథైరొనిన్ కు మాత్రమే చైతన్యము ఉంటుంది. అధికముగా థైరాక్సిన్ ఉత్పత్తి అయినా కాలేయములో ఒక అయొడిన్ అయము తొలగించబడి థైరాక్సిన్ (T4) టైఅయిడో థైరొనిన్ గా (T3) మార్పుజెందుతుంది.

గళగ్రంథి స్రావకములు, థైరాక్సిన్ (T4) అణువులో నాలుగు అయొడిన్ పరమాణువులు, ట్రైఅయిడో థైరొనిన్ (T3) లో మూడు అయొడిన్ పరమాణువులు ఉంటాయి.

{{c|:: 58 ::||