పుట:Hello Doctor Final Book.pdf/417

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

41. అంటు రోగముల నివారణ (Controlling contagious diseases ) ఆ.వె. అంటుకొనుట మాని యంటించి చేజోడి నైదుపదిగఁ జేసి యాదరమ్ము సేయుటదియు కరము క్షేమంబు సర్వత్ర అందుచేతఁ గొనుడు వందనమ్ము !

(ఐదుపదిగఁ జేయు =  నమస్కరించు ; ఆదరము = మన్నన)

మనుజుల నుంచి మనుజులకు చాలా వ్యాధులు వ్యాపిస్తుంటాయి. వీటిని అంటురోగములుగా పరిగణిస్తారు. కొన్ని అంటురోగములు జంతువులు, పక్షులనుంచి మనుజులకు సంక్రమిస్తాయి. వీటిని జంతుజనిత వ్యాధులుగా (Zoonosis) పరిగణిస్తారు. ఈ వ్యాధులను సూక్ష్మజీవులు (bacteria), కాని, విషజీవాంశములు (viruses) కాని, పరాన్నభుక్తులు (parasites) కాని, శిలీంధ్రములు (fungi)  కాని కలిగిస్తాయి. సూక్ష్మజీవులు ( bacteria )

సూక్ష్మజీవులు ఏకకణజీవులు. వీటికి కణకవచము (cell wall), కణవేష్టనము (cell membrane) ఉన్నా, పొరలలో అమరిన న్యూక్లియస్లు, మైటోఖాండ్రియాలు ఉండవు. సూక్ష్మజీవులను గ్రామ్స్ వర్ణకము (Gram’s stain) చేర్చి   సూక్ష్మదర్శిని క్రింద చూసి అవి గ్రహించు వర్ణకములబట్టి గ్రామ్ పోజిటివ్, గ్రామ్ నెగెటివ్ సూక్ష్మజీవులుగా విభజిస్తారు. గ్రామ్ పోజిటివ్ సూక్ష్మజీవులు ఊదారంగులో ఉంటాయి. గ్రామ్ నెగెటివ్ సూక్ష్మజీవులు గులాబిరంగులో ఉంటాయి. ఆకారమును బట్టి వీనిని గోళములు (cocci), కోలలు (rods), సర్పిలములుగా (spirals) వర్ణిస్తారు. చాలా సూక్ష్మాంగ జీవులు మన శరీరముపైన, శరీరము లోపల హాని కలిగించకుండా జీవిస్తున్నా, కొన్ని  అవకాశము చిక్కినపుడు శరీర అవయవములు, కణజాలముల లోనికి చొచ్చుకొని వ్యాధులు కలిగిస్తాయి. కొన్ని సూక్ష్మజీవులు కలుషిత ఆహారము,

416 ::